Share News

ఉద్యాన పంటలను సాగు చేయండి

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:35 PM

దశాబ్దాలపాటు లాభాలు ఆర్జించాలంటే రైతులు ఉద్యాన పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం ఏర్పాటు చేసిన కిసాన్‌ మేళా-2026ను ఎమ్మెల్యే కందుల ప్రారంభించారు.

ఉద్యాన పంటలను సాగు చేయండి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందుల

ఎమ్మెల్యే నారాయణరెడ్డి

ఆకట్టుకున్న కిసాన్‌ మేళా

మార్కాపురం టౌన్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలపాటు లాభాలు ఆర్జించాలంటే రైతులు ఉద్యాన పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం ఏర్పాటు చేసిన కిసాన్‌ మేళా-2026ను ఎమ్మెల్యే కందుల ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన మార్పులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ మేళా ఒక ముఖ్యమైన వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఇటీవలే ప్రభుత్వం రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిని కలుపుతూ రూ.లక్ష కోట్ల భారీ పెట్టుబడితో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ ప్రాజెక్టును మదనపల్లెలో అధికారికంగా ప్రారంభించిందని తెలిపారు. ఈ విస్తృత ప్రణాళికలో భాగంగా మార్కాపురంలో కూడా కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వం మార్కాపురం ప్రాంతాన్ని ఉద్యన పంటల హబ్‌గా తీర్చిదిద్ది ఇక్కడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలైన మార్కాపురం జిల్లా, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేశామని గుర్తుచేశారు. ఇవ్వని హామీలైన హార్టికల్చర్‌ హబ్‌, ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా తాగునీరు వచ్చే ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఒక్క రైతు తమ తోటి రైతులకు హబ్‌ ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించాలని కోరారు. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ శాఖలు ఏర్పాటు చేసిన ఆధునిక యంత్రాలు, సేంద్రియ ఎరువుల వినియోగానికి సంబంధించిన స్టాల్స్‌ను రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు. శాస్త్రవేత్తలు.. పంటలకు అవసరమైన డ్రిప్‌ సిస్టమ్స్‌, స్ర్పింకర్లు, పాలిహౌస్‌ సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి, మిరప వంటి సాధారణ పంటలతో పోల్చితే తక్కువ నీటితో ఎక్కువ లాభాలిచ్చే మామిడి, అరటి, దానిమ్మ పండ్ల సాగు గురించి వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మాలపాటి వెంటకరెడ్డి, మార్కాపురం, మిట్టమీదిపల్లి సొసైటీ అధ్యక్షులు జవ్వాజి రామాంజులరెడ్డి, గొలమారి నాసర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కాకర్ల శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయాధికారి బాలాజీనాయక్‌, ఏపీఎంఐపీ పీడీ జెన్నమ్మ, హార్చికల్చర్‌ ఆఫీసర్‌ రమేష్‌, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 11:35 PM