1,182 హెక్టార్‌లో పంట నష్టం
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:25 AM
ఉమ్మడి జిల్లాలో పంటలు చేతికందే దశలో అకాల వర్షం నష్టపరిచింది. 1,292 మంది రైతులకు చెందిన 1,182 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, రాగి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా
అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, పొద్దుతిరుగుడు
ఉమ్మడి జిల్లాలో నష్టపోయిన 1,292 మంది రైతులు
మార్కాపురం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో పంటలు చేతికందే దశలో అకాల వర్షం నష్టపరిచింది. 1,292 మంది రైతులకు చెందిన 1,182 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, రాగి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. మార్కాపురం జిల్లాలో పొద్దుతిరుగుడు పంటపై వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వెలిగండ్ల మండలం పి.రాళ్లపల్లి గ్రామంలోనే 225 మంది రైతులకు చెందిన 213 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు పొద్దుతిరుగుడు పంట నేలకొరిగింది. జిల్లాలోని మొత్తం 14 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లగా అందులో 9 వెలిగండ్ల మండలంలోనే ఉన్నాయి. కొట్లపల్లి గ్రామంలో 22హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. మిగిలిన గ్రామాల్లో వరి, మొక్కజొన్న, రాగి పంటలకు నష్టం జరిగింది. మొక్కజొన్న ఎర్రగొండపాలెం మండలం మిల్లంపల్లిలో 56 హెక్టార్లలో, పుల్లలచెరువు మండలంలో రెండు గ్రామాల్లో 97 హెక్టార్లలో దెబ్బతింది. పొదిలి, అర్ధవీడు, మార్కాపురం, కంభం మండలాల్లో కూడా స్వల్పంగా పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. అకాల వర్షం కారణంగా ప్రకాశం జిల్లాలో 770 మంది రైతులకు చెందిన 649 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరికి ఎక్కువ నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కురిచేడు, దర్శి, లింగసముద్రం మండలాల్లోని 9 గ్రామాల్లో రైతులకు నష్టం జరిగినట్లు గుర్తించారు. అందులో 7 గ్రామాలు దర్శి మండలంలోనే ఉన్నాయి. మొత్తం 709 మంది రైతులకు చెందిన 589 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లగా అందులో దర్శి మండలంలోనే 685 మంది రైతులకు చెందిన 564 హెక్టార్లు ఉంది. కురిచేడు మండలం ముష్ట్లగంగవరంలో 20 హెక్టార్లలో మొక్కజొన్న, లింగసముద్రం మండలం పెదపవని గ్రామంలో 25 హెక్టార్లలో రైతులు నష్టపోయారు.