Share News

దాహం కేకలు..!

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:12 PM

బల్లికురవ మండలంలోని అంబడిపూడి గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం ద్వారా వచ్చే తాగునీరు వారం రోజుల నుంచి బంద్‌ అయ్యింది. దీంతో నాలుగు గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయింది.

దాహం కేకలు..!
నక్కబొక్కలపాడులో అలంకారప్రాయంగా ఉన్న మినీ వాటర్‌ ట్యాంక్‌, సింగనపాలెంలో నిరుపయోగంగా మంచినీటి కొళాయిలు

అంబడిపూడి రక్షిత పథకం వద్ద కాలిపోయిన మోటార్‌

వారం రోజుల నుంచి తాగు నీరు బంద్‌

నాలుగు గ్రామాలకు నిలిచిన తాగు నీటి సరఫరా

పట్టించుకోని అధికారులు

బల్లికురవ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని అంబడిపూడి గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం ద్వారా వచ్చే తాగునీరు వారం రోజుల నుంచి బంద్‌ అయ్యింది. దీంతో నాలుగు గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు తాగునీరు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండలు విపరీతంగా కాస్తుండడంతో ప్రజలు రక్షిత పథకం నీరు అందక పొరుగు గ్రామాల్లో ఉన్న మినరల్‌ ఆర్వో ప్లాంట్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

బల్లికురవ మండలం పెదఅంబడిపూడి గ్రామంలో ఆరు గ్రామాలకు సంబంఽధించిన రక్షిత మంచినీటి పథకం ఉంది. దీనిద్వారా తాగునీరు వచ్చే గుంటుపల్లి, కొత్తపాలెం, బల్లికురవ, నక్కబొక్కలపాడు గ్రామాలకు వారం రోజుల నుంచి నీటి సరఫరా నిలిచింది. ఈ గ్రామాలకు నీరు సరఫరా చేసే మోటార్‌ కాలిపోవటం వలన తాగునీరు రావటం లేదని ప్రజలు వాపోతున్నారు. మోటార్‌ కాలిపోతే వెంటనే ఏర్పాటు చేయకుండా ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో స్టోరేజ్‌ బావిలో ఇసుక మార్పిడి అని కొన్ని రోజులు తాగునీరు విడుదల చేయలేకపోగా, ఇప్పుడు మోటార్‌ మరమ్మతులతో నీటి సరఫరా నిలిచిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ఆర్వో వాటర్‌ ప్లాంట్ల నీరు ఇమడకపోవటంతో కొందరు ప్రజలు బైకులపై కిలోమీటర్ల దూరం వెళ్లి పొరుగు గ్రామాలలో ఉన్న రక్షిత పథకాల నీటిని తెచ్చుకుంటున్నారు. పేరుకు మాత్రం సీపీ డబ్యూ స్కీమే గాని నెలలో పది రోజులు నీటి విడుదల చేయటం లేదని విమర్శిస్తున్నారు.అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పైపులైన్‌ మరమ్మతులు పూర్తి చేశాం

హనుమాన్‌ బాబు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ

సింగనపాలేనికి ఎన్‌ఏపీ నీరు వారం రోజులుగా నిలిచిపోయిన మాట వాస్తవం. తూర్పు వీరాయపాలెం వద్ద పైపులైన్‌ పగిలిపోవడం వలన నీరు నిలిపివేశాం. మరమ్మతులు పూర్తి చేశాం. గురువారం నుంచి నీరు విడుదల చేసి గ్రామస్థులకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తాం.


వారం రోజులుగా సింగనపాలెంలో తాగునీరు కట్‌

ముండ్లమూరు, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని సింగనపాలెంకు వారం రోజులుగా ఎన్‌ఏపీ నీరు నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులకు తాగునీటి కష్టాలు ముమ్మరించాయి. దర్శి సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు నుంచి సింగనపాలేనికి తాగునీరు సరఫరా అవుతుంటుంది. దరిశి-తూర్పు గంగవరం పైపులైను తూర్పు వీరాయిపాలెం వద్ద వారం రోజుల క్రితం పగిలిపోయింది. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడం వలన తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. గొంతు తడుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:12 PM