రావినూతలలో క్రికెట్ సంబరం
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:22 PM
రావినూతలలో 32వ అంతర్రాష్ట్ర సంక్రాంతి క్రికెట్ పోటీలు ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు జరుగుతాయని అసోసియేషన్ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు(బాబు), సినీనటుడు రఘుబాబు చెప్పారు.
ఈనెల 9 నుంచి సంక్రాంతి క్రికెట్ కప్ పోటీల నిర్వహణ
పాల్గొననున్న 16 జట్లు
మేదరమెట్ల, జనవరి 4 : మండలంలోని రావినూతలలో 32వ అంతర్రాష్ట్ర సంక్రాంతి క్రికెట్ పోటీలు ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు జరుగుతాయని అసోసియేషన్ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు(బాబు), సినీనటుడు రఘుబాబు చెప్పారు. ఆదివారం రావినూతలలోని రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్యర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. పోటీల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ముఖ్యఅతిథులుగా హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు, చెన్నైల నుంచి జట్లు పాల్గొంటున్నాయని చెప్పారు. మొత్తం 16 టీంలు పాల్గొంటున్నట్టు వివరించారు. ఈ పోటీలను నాకౌట్ కం లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రథమ బహుమతి రూ.3 లక్షలు సింథైట్ ఫ్యాక్టరీ, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు శ్రీభ్రమరా వెంచర్స్, తృతీయ బహుమతి రూ.లక్ష ధృతి డెవలపర్స్ అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు అసోసియేషన్ చైర్మన్ నాగేశ్వరరావు తెలిపారు.
20వేల విలువైన కుర్చీలు అందజేత
అసోసియేషన్‌కు రావినూతల గ్రామానికి చెందిన మోపర్తి వెంకట్రావు, పూనాటి బసవయ్య రూ.20 వేల విలువైన కుర్చీలను అందజేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు తెలిపారు. దాతలను సినీనటుడు రఘుబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పూనాటి వెంకట్రావు, ఎడ్లపల్లి నరసింహారావు, అప్పారావు, జయంతిబాబు, కారుసాల సుబ్బయ్య, చేబ్రోలు నాగేశ్వరరావు, రామినేని శ్రీనివాసరావు, కారుసాల బ్రహ్మానందం, కారుసాల శ్రీనివాస్, వల్లెపు శ్రీకాంత్, బండారు రామాంజనేయులు, ఎండ్లూరి శ్రీకాంత్ పాల్గొన్నారు.