Share News

లెక్క.. పక్కా!

ABN , Publish Date - Apr 05 , 2026 | 02:36 AM

ప్రజా ప్రభుత్వం బడ్జెట్‌పై వినూత్న అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాకు ఇచ్చిన నిధుల కేటాయింపులపైనా స్పష్టతనిచ్చింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో జిల్లాకు వివిధ సంక్షేమ పథకాలు, ఇతర కేటాయింపుల కింద సుమారు రూ.4,200 కోట్లు ఈఏడాది లబ్ధి చేకూరనుంది.

లెక్క.. పక్కా!
బడ్జెట్‌ ఔట్రీచ్‌ సదస్సులో మాట్లాడుతున్న కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

బడ్జెట్‌లో ప్రకాశంకు రూ.4,200 కోట్లు

సూపర్‌ సిక్స్‌ పథకాలకే రూ.1,776 కోట్లు

మిగతా వాటికి రూ.2,423.14 కోట్లు

కేటాయింపులపై ప్రజలకు అవగాహన

బడ్జెట్‌ ఔట్రీచ్‌ పేరుతో ప్రత్యేక సదస్సులు

మూడు రోజుల క్రితం ఒంగోలులో రెండు జిల్లాల సదస్సు

అనంతరం నియోజకవర్గాల వారీ నిర్వహణ

ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్‌ లక్ష్యాలపైనా సదస్సుల్లో వివరణ

మార్కాపురం జిల్లాకు రూ.2,725 కోట్లు

ప్రజా ప్రభుత్వం బడ్జెట్‌పై వినూత్న అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాకు ఇచ్చిన నిధుల కేటాయింపులపైనా స్పష్టతనిచ్చింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో జిల్లాకు వివిధ సంక్షేమ పథకాలు, ఇతర కేటాయింపుల కింద సుమారు రూ.4,200 కోట్లు ఈఏడాది లబ్ధి చేకూరనుంది. అందులో కూటమి ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా రూ.1,776.77 కోట్లు అందనుంది. ఇతర పథకాల ద్వారా 2,423.14 కోట్లు రానున్నాయి. ఆ మేరకు లెక్కలు వేయగా బడ్జెట్‌ ఔట్రీచ్‌ పేరుతో ప్రస్తుతం నిర్వహిస్తున్న సదస్సుల్లో వాటిని ప్రజలకు ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు వివరిస్తున్నారు.

ఒంగోలు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : సాధారణంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలు, వాటిపై చర్చ, ఆమోదం అంతా అసెంబ్లీలోనే జరుగుతుంది. ఒక్క ఇరిగేషన్‌లో అది కూడా ప్రాజెక్టుల వారీ మినహా ఇతర రంగాలకు సంబంధించి జిల్లాలకు ఎంతమేర కేటాయింపులు అన్నది తెలిసే అవకాశం ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా పథకాల వారీ ఖర్చు చేస్తుంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026-27)కు రూ.3.36లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన ప్రభుత్వం ఆ ప్రతిపాదనలు, కేటాయింపులపై ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని నిర్ణయించింది. అందుకోసం బడ్జెట్‌ ఔట్రీచ్‌ పేరుతో జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ప్రత్యేక సదస్సుల నిర్వహణకు ఆదేశించింది. ఆ సంద ర్భంగా ప్రభుత్వ పరిపాలన ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, వారి పెన్షన్లు వంటి వాటిని పక్కనపెట్టి ఇతర రంగాల ద్వారా జిల్లాకు, అందులో నియోజకవర్గాలకు ఎంత మేర కేటాయింపులు జరిగాయి? ఎంతమొ త్తంలో ప్రజలకు లబ్ధి చేకూరనుంది? అన్న అంశాలను ప్రజలకు వివరించాలని సూచిం చింది. ప్రత్యేకంగా ప్రభుత్వం ఆయావర్గాల ప్రజలకు అందిస్తున్న సూపర్‌ సిక్స్‌.. ఇతర సంక్షేమ పథకాలు, వివిధ రంగాలకు కేటాయింపులను వివరించాలని సూచించింది. అందుకు సంబంధించిన లెక్కలను కలెక్టర్ల నేతృత్వంలో యంత్రాంగం రూపొందించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, భవిష్యత్‌ కార్యక్రమాలపై కూడా అవగాహన కల్పించాలని ఆదేశించింది. ఈమేరకు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జిల్లా, నియోజకవర్గస్థాయి సదస్సులకు షెడ్యూల్‌ ఇచ్చింది. రాష్ట్ర మంత్రుల నుంచి గ్రామస్థాయి కీలక ప్రజాప్రతినిధుల వరకు.. కలెక్టర్‌ నుంచి క్షేత్రస్థాయి వరకు పాలనలో కీలకమైన అధికారులంతా ఈ సదస్సుల్లో పాల్గొనాలని సూచించింది. జిల్లాస్థాయిలో ఇన్‌చార్జి మంత్రి పర్యవేక్షణలో, నియోజకవర్గ స్థాయిలో స్పెషల్‌ ఆఫీసర్ల నేతృత్వంలో వీటి నిర్వహణకు ఆదేశించింది. తదనుగుణంగా ఈనెల 2న ఒంగోలులో ప్రకాశం, మార్కాపురం రెండు జిల్లాల సదస్సు జరిగింది. ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మంత్రి డాక్టర్‌ స్వామి, రెండు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, కీలక అధికారులంతా పాల్గొన్నారు. జిల్లాకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.4,200 కోట్లు కేటాయింపులు లభించినట్లు అందులో వెల్లడించారు.

ఎన్టీఆర్‌ భరోసాకే సింహభాగం

సూపర్‌సిక్స్‌ పథకాల్లో కీలకమైన ఎన్‌టీఆర్‌ భరోసా కింద సింహభాగం నిధులు అందుతున్నాయి. ఆ పథకం ద్వారా ఏడాదికి రూ.1,149.68 కోట్లు లబ్ధిదారులకు అందనున్నాయి. అలాగే సూపర్‌సిక్స్‌లో ఇతర పథకాలైన తల్లికి వందనం ద్వారా రూ.311.98 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద రూ.163.15 కోట్లు, దీపం-2 కింద రూ.85.43 కోట్లు, స్త్రీశక్తి పథకం ద్వారా రూ.42.52 కోట్లు ఇలా మొత్తంగా సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా సుమారు రూ.1,776.77 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది. వ్యవసాయ, పశుసంవర్థక, విద్య, వైద్యం, స్త్రీశిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, కార్పొరేషన్ల పరిధిలో వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు మరో రూ.2,423.14 కోట్లు మేర రానున్నాయి. ఇలా మార్కాపురం జిల్లాకు రూ.2,725 కోట్లు రానున్నట్లు సమాచారం.

నియోజకవర్గ స్థాయి సదస్సులు ప్రారంభం

ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని వివిధ నియోజకవర్గ స్థాయి సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా శనివారం ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గ స్థాయి సదస్సులు జరిగాయి. ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయంలో స్పెషల్‌ ఆఫీసరైన ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న నేతృత్వంలో జరిగిన సదస్సులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. చీమకుర్తి మునిసిపల్‌ కార్యాలయంలో ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గ స్థాయి సదస్సు జరగ్గా ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ మహేష్‌ తదితరులు పాల్గొనగా దర్శి మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేక అధికారి జాన్సన్‌ నేతృత్వంలో జరిగింది.

Updated Date - Apr 05 , 2026 | 02:36 AM