ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్
ABN , Publish Date - Jun 21 , 2026 | 02:55 AM
మినిమం టైం స్కేలు (ఎంటీఎస్) కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డీఎస్సీ 2008, 1998 టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించనున్నారు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్) ప్రకారం వీరిని సర్దుబాటు చేయనున్నారు.
22 నాటికి ప్రక్రియ పూర్తికి ఆదేశం
ఒంగోలు విద్య, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): మినిమం టైం స్కేలు (ఎంటీఎస్) కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డీఎస్సీ 2008, 1998 టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించనున్నారు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్) ప్రకారం వీరిని సర్దుబాటు చేయనున్నారు. ఈనెల 22 నాటికి ప్రక్రియ పూర్తికానుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. ఎంటీఎస్ టీచర్ల సర్వీసును జూన్ 1 నుంచి 2027 ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈనేపథ్యంలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తికి సంబంధించి జూన్ 20నాటికి పాఠశాలల్లో నమోదైన విద్యార్థులు, పనిచేస్తున్న టీచర్లను ప్రామాణికంగా తీసుకొని సర్దుబాటు చేయనున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు, అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారు, ప్రస్తుతం విధుల్లో చేరని వారిని మినహాయించి మిగిలిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించనున్నారు. ఎంటీఎస్ టీచర్ల కౌన్సెలింగ్‌కు ఖాళీలను గుర్తించేందుకు విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో మార్పులు చేశారు. ఈనెల 20 నాటికి నమోదును ప్రామాణికంగా తీసుకొని ఖాళీలను గుర్తించి పాఠశాలల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉపాధ్యాయులు పీటీఆర్ ప్రకారం సరిపోతే ఖాళీ పోస్టులను బ్లాక్ చేయాలి. అందుకు సంబంధించిన విఽధివిధానాలను విద్యాశాఖ జారీచేసింది.