్జ్జకార్పొరేషన్‌లో అవినీతి జలగలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:16 AM
కొళాయి వద్ద నుంచి కొత్తింటికి ప్లాను.. ఖాళీ స్థలం నుంచి కట్టుకున్న ఇంటికి పన్ను.. ఇలా ఏ పని కోసం వెళ్లినా పైసలు వసూలే...! మొత్తంగా అవినీతి కంపుతో ఒంగోలు నగరపాలక సంస్థ దారుణంగా తయారైంది.
ఒంగోలు నగర పాలక సంస్థలో
శ్రుతిమించుతున్న ఉద్యోగుల చేతివాటం
ఏసీబీ దాడులతో కలవరం
కొళాయి వద్ద నుంచి కొత్తింటికి ప్లాను.. ఖాళీ స్థలం నుంచి కట్టుకున్న ఇంటికి పన్ను.. ఇలా ఏ పని కోసం వెళ్లినా పైసలు వసూలే...! మొత్తంగా అవినీతి కంపుతో ఒంగోలు నగరపాలక సంస్థ దారుణంగా తయారైంది. కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల చేతివాటానికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. పాలకవర్గంలోని కొందరు కార్పొరేటర్లు తమకు ప్రతినెలా మామూళ్లు చెల్లించాల్సిందేనంటూ అధికారులను డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కొన్ని డివిజన్ల ప్రజలు ముందుగా వారిని ప్రసన్నం చేసుకుంటేనే పనులు జరిగే పరిస్థితి. కార్యాలయంలో ఏ విభాగంలో చూసినా, ఏ ఫైలు కదలాలన్నా అటు కార్పొరేటర్లు, ఇటు కార్యాలయ ఉద్యోగులు నుంచి ‘నాకేంటి?’ అనే మాట వినిపిస్తోంది. మంగళవారం ఏసీబీ దాడితో ఈ వ్యవహారం బట్టబయలైంది.
ఒంగోలు కార్పొరేషన్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరపాలక సంస్థలో అవినీతి బాగోతానికి అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించడం లేదు. వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా సిబ్బందిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. 2017లో టౌన్ ప్లానింగ్‌లో బీపీఎస్ ఫైళ్ల సమస్యల పరిష్కారానికి అందులో పనిచేసే కొందరు ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత 2022లో ఇంటికి పన్ను వేయడానికి ఓ రెవె న్యూ ఇన్‌స్పెక్టర్ డబ్బులు డిమాండ్ చేయడంతో మరో సారి ఏసీబీ అధికారులు రైడ్ చేసి అరెస్ట్ చేశారు. తాజాగా మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో దాడులు నిర్వహించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ఆర్థిక లావాదేవీలు, ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో కలవరం మొదలైంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఏసీబీ అధికారులు దాడులు ప్రారంభించగా, కలవరపాటుకు గురైన కార్యాలయ ఉద్యోగులు తమ సీట్లు వదిలి పరుగులు పెట్టారు. దీంతో కార్యాలయంలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. కొందరు సిబ్బంది తమ సెల్‌ఫోన్‌లు స్విచ్‌ఆఫ్ చేశారు. కార్పొరేషన్‌లో ఏసీబీ తనిఖీలు నగరమంతా చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్రభు త్వం పౌరసేవలను పారదర్శకంగా అందిస్తున్నట్లు పదేపదే ప్రకటిస్తోంది. అందుకోసం సచివాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అక్కడ పనిచేసే కొందరు సిబ్బంది చేతివాటం మొదలుపెట్టారు. ప్రతి దరఖాస్తు సచివాలయం నుంచే పంపాల్సి ఉండటంతో ప్లానింగ్ సెక్రటరీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఉద్యోగులు కూడా ప్రజలు ఏ పనిమీద వచ్చినా సచివాలయంలో పైసలు ఇవ్వకుంటే సర్వర్ సమస్య అంటూ బదులిస్తారు. ఇదిలా ఉండగా ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్‌ల నుంచి అధికారుల వరకు అవినీతి దారిలోనే నడుస్తున్నారు.
మారుతున్న ‘టౌన్ ప్లానింగ్’
పక్కా ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే పట్టణ ప్రణాళిక విభాగం వారిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులకు సమానంగా పట్టణ ప్రణాళిక విభాగం యంత్రాంగానికి చెల్లించాల్సి రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సులభంగా.. వేగంగా.. పారదర్శకతకు పెద్దపీట పేరుతో భవన నిర్మాణ అనుమతులను ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు ఆర్కిటెక్చర్స్ (లైసెన్స్‌డ్ బిల్డింగ్ సర్వేయర్స్) వద్ద ఆటోకాడ్‌లోప్లాన్ గీయించాలి. అయితే కథంతా ఇక్కడే మొదలవుతుంది. కొందరు ఎల్‌టీపీలే అంతా తామై చక్రంతిప్పుతున్నారు. ఇందులో కొత్తగా కార్పొరేటర్లు తలదూర్చి ఆన్‌లైన్ ఇబ్బందులు ఉన్నా, ప్లాన్ రాకున్నా తాము చూసుకుంటామని చెబుతూ దోచుకుంటున్నారు. ఇక అనుమతుల్లేని లే అవుట్‌లు, డీకేపట్టాలతో భవన నిర్మాణాలు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటీవల అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ కోసం, అక్రమ లేఅవుట్‌లను రెగ్యులర్ చేసుకునేందుకు ప్రభుత్వం బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఫైళ్లన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ క్రమబద్దీకరించుకునేందుకు పైసలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేయడంతో బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ నూరుశాతం లక్ష్యాలకు దూరమైందని తెలుస్తోంది.
అస్తి పన్ను కంటే ముందు మామూళ్ల పన్ను
ప్రభుత్వ ఆదాయ వనరులు ప్రజలు చెల్లించే పన్నులే. పట్టణాల్లో ఆస్తి, నీటి పన్నులే కీలకం. కానీ ఒంగోలు కార్పొరేషన్‌లో అందుకు విరుద్ధంగా నడుస్తోంది. ఒక ఇంటికి పన్ను వేయాలంటే కనీసం రూ.15వేలు తగ్గకుండా చెల్లించాల్సిందే. ఇక అపార్ట్‌మెంట్‌లు, డూప్లెక్స్ ఇళ్లు, ఆధునిక హంగులతో నిర్మించిన ఇళ్లకైతే రూ.లక్షల్లోనే ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తుంది. పన్నులు చెల్లిస్తాము మహాప్రభూ అంటే పన్ను సరే మా సంగతేమిటని రెవెన్యూ విభాగం భీష్మించుకు కూర్చుంటుంది. కొందరు ఆర్‌ఐలు, మరి కొందరు ఉద్యోగులు క్షేత్రస్థాయిలో తమ విధులు విస్మరించి, అక్రమ సంపాదనే ధ్యేయంగా పెట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రత్యేకించి, ఆన్‌లైన్ పేరుతో అవినీతికి అడ్డగోలుగా గేట్లు తెరిచిన రెవెన్యూ జలగలు ప్రజల కష్టాన్ని పీల్చేస్తున్నాయి.
ఇంజనీరింగ్‌లోనూ అవినీతి
ఇంజనీరింగ్ విభాగంలోనూ అవినీతి కంపు కొడుతోంది. పేదలకు ప్రభుత్వం అందించే రూ.200లకే తాగునీటి కొళాయి కనెక్షన్‌కు రూ.10వేలు చేల్లిస్తేనే వర్క్ ఆర్డ్‌ర్ లభించే పరిసితి. అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరికిపర్సంటేజిలు అందరికీ తెలిసిన విషయం. లెస్ వర్కులు మోర్ ఇన్‌కం వ్యవహారం ఇక్కడ నడుస్తుంది. కాంట్రాక్టర్‌లు, కార్పొరేషన్ ఇంజనీర్లు కుమ్మక్కై ప్రగతి పనుల్లో నాణ్యతకు పాతరేస్తున్నారు. ఇక పట్టణాల్లో అక్రమ కొళాయిలకు అంతూపొంతు లేదు. కనెక్షన్ల మాటున కలెక్షన్‌లు చేస్తున్న ఫిట్లర్లు, వారి అండదండలతో ప్రైవేటు లైసెన్స్‌డు ఫ్లంబర్లు వేసే అక్రమ కొళాయిలకు లెక్కాలేదు.