Share News

అవినీతికి అందలం

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:07 AM

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో మళ్లీ ఇష్టారాజ్యం నెలకొంది. గత కొన్నేళ్లుగా బోగస్‌ గ్రూపులు సృష్టించి అమాయక పొదుపు మహిళలను బాధ్యులుగా చేసి రూ.లక్షలు దండుకున్న పలువురిపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది.

అవినీతికి అందలం

మెప్మాలో మళ్లీ ఇష్టారాజ్యం

బోగస్‌ గ్రూపుల్లో కీలక ఉద్యోగికి అధికారాలు

తొలగించిన వారిలో కొందరికి తిరిగి ఉద్యోగాలు?

అధికారులు దృష్టిసారిస్తేనే అక్రమాలకు అడ్డుకట్ట

ఒంగోలు కార్పొరేషన్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో మళ్లీ ఇష్టారాజ్యం నెలకొంది. గత కొన్నేళ్లుగా బోగస్‌ గ్రూపులు సృష్టించి అమాయక పొదుపు మహిళలను బాధ్యులుగా చేసి రూ.లక్షలు దండుకున్న పలువురిపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన కలెక్టర్‌ రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు అప్పటి జేసీ గోపాలకృష్ణ నేతృత్వంలో విచారణ చేయించిన విషయం విదితమే. అవినీతి, అక్రమాల్లో భాగస్వాములైన వారిని ఆయన గుర్తించి నివేదికలు సమర్పించారు. మెప్మా కేంద్ర కార్యాలయం దీనిపై పరిశీలన చేసి అప్పటిపీడీ శ్రీహరితోపాటు మరో తొమ్మిది మందిని సస్పెండ్‌ చేస్తూ ఉత్వర్వులు జారీచేసింది. అప్పట్లో ఈ వ్యవహారం జిల్లావ్యాప్తంగా పొదుపు సంఘాలలో చర్చనీ యాంశమైంది. కాగా ఇటీవల మళ్లీ మెప్మాలో అక్రమాలకు పాల్పడిన వారే చక్రం తిప్పుతుండటం విశేషం. మెప్మాలో బ్యాంకు రుణాలను పరిశీలించి నెలవారీ ఏ గ్రూపునకు ఎంత రుణం అందజేశారన్న నివేదికలు భద్రపరచడంతోపాటు, ఉన్నతాధికారులకు తెలియజేయాలి. అయితే సదరు అధికారి అవినీతికి పెద్దపీట వేశారు. బోగస్‌ గ్రూపులను ప్రోత్సహించారు. నెలవారీ రుణాల మంజూరు ఫైళ్లను సైతం మాయం చేసి, కనిపించడం లేదని సమాధానం చెప్పారు. దీంతో మెప్మాలో రూ.కోట్లలో అవినీతి జరిగిందని విచారణ కమిటీ నిర్ధారించింది. ముఖ్యంగా బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరైన రుణాల నెలవారీ వివరాలు దాచిపెట్టడంతో కొందరు బోగస్‌ గ్రూపుల సూత్రధారులు తప్పించుకున్నారు. కొందరిపై మాత్రమే వేటుపడింది. పీడీశ్రీహరి బదిలీ అనంతరం బాపట్ల ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆనంద్‌ సత్యపాల్‌ ఇన్‌చార్జి పీడీగా ప్రకాశం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన్ను సైతం పక్కదారి పట్టించే విధంగా ఇక్కడ పాతుకుపోయిన కొందరు అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. బోగస్‌ గ్రూపులకు భరోసా కల్పించిన బ్యాంకు లింకేజి అధికారిణికి ఇన్‌చార్జి అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించడం పట్ల అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో జరిగిన బోగస్‌ గ్రూపుల అవినీతి బాగోతంలో ఈ బ్యాంకు లింకేజీ అధికారి పాత్ర కీలకంగానే ఉంది. తిరిగి ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో మెప్మాలో బోగస్‌ బాగోతం మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఓ నాయకురాలి రాయబారాలు

గ్రూపులను ఆన్‌లైన్‌ చేసే ఓ ఉద్యోగి కూడా అవినీతికి సహకరించారు. అప్పట్లోఒక్కో బోగస్‌ గ్రూపు ఆన్‌లైన్‌కు రూ.50వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉండటంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. కార్యాలయం నుంచే కీలకంగా వ్యవహరించిన ఆ ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు భారీగానే కసరత్తు జరుగుతున్నట్లు సమచారం. అందులో రాజకీయ పార్టీలో కాస్తంత పలుకుబడి ఉండి, మెప్మాలో అవినీతి వ్యవహరాలపై పట్టు ఉన్న ఓ మహిళా నాయకురాలు అవినీతి ఆరోపణలతో తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకు వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.ఇదిలాఉండగా ఒంగోలులో పనిచేస్తున్న ఓ సీవోను విమర్శలపై మార్కాపురం బదిలీ చేశారు. ఆమెపై అనేక ఆరోపణలు రావడంతో క్రమశిక్షణ చర్యలు కింద బదిలీచేయగా,మూడు నెలలకే ఆమె తిరిగి ఒంగోలుకు వచ్చారు. దీనివెనుక భారీగా చేతులు మారినట్లు సమాచారం. మొత్తంగా గతంలో బోగస్‌ గ్రూపుల బాగోతాన్ని ఆంధ్రజ్యోతి బయటపెట్టడంతో పది మంది సస్పెన్షన్‌కు గురికాగా, అదే అవినీతిలో ఉన్న మరికొందరు తప్పించకున్నారు. రెండు నెలలపాటు కాస్తంత స్తబ్దుగా ఉన్నప్పటికీ గత వారంరోజుల నుంచి తిరిగి మెప్మాలో ఇష్టారాజ్యం నెలకొంది. దీంతో పాత కథ మళ్లీ మొదటికొస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు కాస్తంత మెప్మాపై ప్రత్యేక దృష్టి సారిస్తే పట్టణ పేద మహిళలకు అన్యాయం జరగకుండా, రూ.కోట్ల అవినీతిని అరికట్టే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Feb 21 , 2026 | 02:07 AM