Share News

అవినీతి, అక్రమాలు

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:10 AM

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిధులతోపాటు స్థానికంగా ఆదాయ వనరుల పెంపుపై దిశానిర్దేశం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు.

అవినీతి, అక్రమాలు
ఒంగోలులోని డీపీవో కార్యాలయం

రెచ్చిపోతున్న పంచాయతీ కార్యదర్శులు

ప్రభుత్వ ఆశయాలకు భిన్నంగా వారి పనితీరు

గ్రామాల్లో అంతా మేమే అన్నట్లు వ్యవహార శైలి

షోకాజ్‌ నోటీసులు ఇచ్చినా స్పందన కరువు

ఇంటి పన్నుల వసూలు అంతంతమాత్రమే

పల్లెపాలెం కార్యదర్శి ఏసీబీకి చిక్కడంతో ఉలికిపాటు

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిధులతోపాటు స్థానికంగా ఆదాయ వనరుల పెంపుపై దిశానిర్దేశం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. వారు ప్రభుత్వ ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సొంత ఆదాయమే లక్ష్యంగా పనిచేస్తున్నారే తప్ప పంచాయతీల ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గత వైసీపీ పాలనలో గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యమైంది. పంచాయతీల్లో చేసిన పనుల్లో పారదర్శకత కొరవడడంతోపాటు ఇష్టారీతిన బిల్లులు చెల్లించారన్న విమర్శలున్నాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటువంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పదేపదే హెచ్చరికలు చేస్తున్నా కార్యదర్శులు అవేమీ పట్టించుకోవడం లేదు. పంచాయతీల్లో తామే రాజ్యాధికారులం అన్న విధంగా వ్యవహరిస్తున్నారు.

ఇష్టారీతిన ఖర్చు చేస్తున్నారు

ఇటీవల కాలంలో భారీగా బిల్లులు చేస్తున్నారు. స్థానికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు నిధులు లేవనే సాకు చూపి పక్కనపెడుతున్నారు. కనీసం కార్మికులకు జీతాలు ఇవ్వని పంచాయతీలు అనేకం ఉన్నాయి. వ్యక్తిగతంగా లాభం చేకూర్చే పనులకు మాత్రం ప్రధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీల్లో వివిధ పనుల పేరుతో నిధులను కార్యదర్శులు ఇష్టారీతిన ఖర్చుచేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల పాలకవర్గాలతో కార్యదర్శులు కుమ్మక్కై బిల్లులు మంజూరు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే నిధుల దుర్వినియోగంపై ఐదారుగురు పంచాయతీ కార్యదర్శులు సస్పెండయ్యారు. తాజాగా కొత్తపట్నం పంచాయతీ కార్యదర్శి సంపత్‌కుమార్‌... అభివృద్ధి పనులకు బిల్లులు చేసేందుకు రూ.55వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవతుంది. వెలుగులోకి రాని అవినీతి, అక్రమాలు అనేకం ఉన్నాయి.

పన్నులు వసూలు చేయరు

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్నులు, ఇతర బకాయిలు వసూలు చేయాలని ఆదేశించారు. నాలుగైదు నెలలుగా రాష్ట్రస్థాయి నుంచి పంచాయతీరాజ్‌ కమిషనర్‌, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ రాజాబాబులు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. అయినా కార్యదర్శులు కదలని కారణంగా లక్ష్యాల సాధనలో జిల్లా వెనుకబడిపోయింది. గత వారంలో పంచాయతీరాజ్‌ శాఖ అధికారే ఒంగోలు వచ్చి ఈనెల 15వతేదీ నాటికి నూరుశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో పన్నుల వసూళ్లలో, తడిచెత్త, పొడిచెత్తపై ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో 55మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారంటే వారి పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మండల స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాల్సిన డిప్యూటీ ఎంపీడీవోలు జిల్లా స్థాయి నుంచి వచ్చే అదేశాలను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పంచాయతీరాజ్‌ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏడుగుండ్లపాడు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

దొడ్డవరం సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీసు

మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు పంచాయతీ కార్యదర్శి టి.అజయ్‌ కీర్తిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ రాజాబాబు ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ప్రస్తుతం గుళ్లాపల్లికికి కూడా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అజయ్‌కీర్తి మద్దిపాడు మండలం దొడ్డవరం కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో పంచాయతీలో ఎలాంటి తీర్మానం లేకుండా సర్పంచ్‌ సుబ్బారావుతో కలిసి పెట్రోలు బంకు ఏర్పాటుకు అక్రమంగా ఎన్‌వోసీ ఇచ్చారు. దీనిపై మీకోసంలో కలెక్టర్‌కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆయన పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఒంగోలు డీఎల్‌పీవో పద్మ విచారణ చేశారు. పెట్రోలు బంకు ఏర్పాటుకు సంబంధించి పంచాయతీ గ్రామసభలో చర్చించకుండా, ఎలాంటి తీర్మానం లేకుండా ఎన్‌వోసీ ఇచ్చినట్లు గుర్తించారు. గతంలోనే మరొకరికి పంచాయతీ తీర్మానం చేసిన అవేమీ పట్టించుకోకుండా సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి కలిసి ఇతరులకు ఎన్‌వోసీ ఇచ్చినట్లు తేల్చారు. ఈ మేరకు నివేదికను ఇచ్చారు. దాని ఆధారంగా అజయ్‌ కీర్తిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. దొడ్డవరం సర్పంచ్‌ సుబ్బారావుకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

Updated Date - Feb 11 , 2026 | 02:10 AM