చూచిరాతలే!
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:58 AM
విద్యాపరంగా ఎంతో కీలకమైన బీఈడీ పరీక్షలు ఇష్టారాజ్యంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. చూచిరాతలు షరామామూలైపోయాయి. పక్కరాష్ట్రాల నుంచి భారీగా విద్యార్థులు తరలివచ్చి లాడ్జీలలో ఉంటూ పరీక్షలు రాస్తున్నారు.
ప్రహసనంగా బీఈడీ పరీక్షలు
జోరుగా మాస్ కాపీయింగ్
ఇష్టారాజ్యంగా సాగుతున్న వ్యవహారం
గైర్హాజరైన వారిస్థానంలో ఇతర వ్యక్తులు
కళాశాలల సిబ్బందే ఇన్విజిలేటర్లు
కన్నెత్తిచూడని యూనివర్సిటీ అధికారులు
విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజలు
విద్యాపరంగా ఎంతో కీలకమైన బీఈడీ పరీక్షలు ఇష్టారాజ్యంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. చూచిరాతలు షరామామూలైపోయాయి. పక్కరాష్ట్రాల నుంచి భారీగా విద్యార్థులు తరలివచ్చి లాడ్జీలలో ఉంటూ పరీక్షలు రాస్తున్నారు. గైర్హాజరైన వారి స్థానంలో కొత్త వ్యక్తులు హాజరవుతున్నారు. ప్రధానంగా ప్రైవేట్ బీఈడీ కళాశాలల సిబ్బందే ఇన్విజిలే టర్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అంతా వారి కనుసన్నల్లోనే సాగుతోంది. పరీక్షల తీరును చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన అధికారులు అటువైపు కన్నెత్తిచూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
దర్శి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): భావిభారత పౌరు లకు విద్యను బోధించే గురువుల పోస్టులకు అవసరమైన బీఈడీ పరీక్షలు ప్రహసనంగా మారాయి. ప్రైవేట్ బీఈడీ కళాశాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడు కరువుయ్యాడు. పరీక్షలలో జరుగుతున్న వ్యవహారాన్ని చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఒక్క దర్శిలోనే 17 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో 110 మంది విద్యార్థులు ఉంటారు. వీరిలో 90శాతం మంది ఇతర రాష్ర్టాలకు చెందిన వారే. ఫీజులు చెల్లించి పరీక్షలకు హాజరుకావడం తప్ప ఒక్కరోజు కూడా బోధనా క్లాసులు జరిగిన దాఖలాలు లేవు. ఎలాంటి బోధన లేకుండా పాస్ గ్యారెంటీ పేరుతో కొంతమంది దళారులు ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలకు చెందిన విద్యార్థులను ఇక్కడ చేర్పిస్తున్నారు. వారి నుంచి ఫీజులు, ఇతర మేనేజ్‌మెంట్ వ్యవహారాల కోసం లక్షలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. చదువులతో పనిలేకుండా బీఈడీ సర్టిఫికెట్ వస్తుండటంతో దళారులు అడిగిన ప్రకారం సొమ్ము చెల్లించి పరీక్షలకు హాజరవుతున్నారు. అందుకనుగుణంగానే ఇక్కడ పరీక్షల్లో చూచిరాతలతో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కంభం, ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
భారీగా నడుస్తున్న ముడుపుల దందా
ప్రైవేట్ బీఈడీ కళాశాలల్లో పనిచేసే సిబ్బందే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఏది అవస రమైనావిద్యార్థులకు వారు పూర్తిగా సహకరిస్తు న్నారు. కళాశాలల పనితీరు, పరీక్షల నిర్వహణను అజమాయిషీ చేస్తున్న యూనివర్సిటీ అధికారులు ముడుపులు తీసుకొని అక్రమాలకు సహకరిస్తున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ చేయి తడిపిన మేనేజ్‌మెంట్‌లకు చెందిన కేంద్రాలను యూనివర్సిటీ అధికారులు తనిఖీ చేయరు. మిగిలినచోట్ల అరకొర దాడులతో మమ అనిపిస్తు న్నారు. పరీక్షలు ఆరంభమైనరోజు మార్కాపురం, పొదిలి, చీరాల పట్టణాల్లో స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేయగా తొమ్మిది మంది పట్టుబడ్డారు. వీరంతా మాస్ కాపీయింగ్‌కు పాల్పడటం, పుస్తకా లు చూచిరాస్తూ దొరకడంతో డీబార్ చేశారు. అన్నీప్రాంతాల్లో తనిఖీలు చేస్తే బీఈడీ పరీక్షల గుట్టురట్టు కావడం ఖాయం.
విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు
ప్రైవేట్ బీఈడీ కళాశాలల అక్రమాలు, ప్రహసనంగా మారిన పరీక్షల నిర్వహణపై కొంతమంది రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఏళ్ల తరబడి బోధన లేకుండానే బీఈడీ కళాశాలలు నడుస్తున్నాయని, ఇతర రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు నేరుగా పరీక్షలకు హాజరవుతున్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అందుకు స్పందించిన మంత్రి లోకేష్ సంబంధిత అధికారులను విచారణకు ఆదేశిస్తామని తెలిపినట్టు తెలిసింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అక్రమాలు కొనసాగడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విద్యావ్యవస్థలో లోపాలను సరిదిద్ది నాణ్యమైన విద్యను అందించేందుకు మంత్రి నారా లోకేష్ ఎన్నో మార్పులు చేశారు. ప్రైవేట్ బీఈడీ విద్య నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.