Share News

సహకారం.. ఇష్టారాజ్యం

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:53 AM

జిల్లా సహకార శాఖలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ శాఖ పాలనా వ్యవహారాలను అటు రాష్ట్ర, ఇటు జిల్లా ఉన్నతాధికారులు గాలికొదిలేశారు. రోజువారీ ఇతర శాఖల్లో ఉన్నట్లు కీలక ప్రజాప్రతినిధుల జోక్యం పెద్దగా అందులో లేకపోవడం, అంతకు మించి బాధ్యతగల పాలకపక్ష పెద్దలు దృష్టిపెట్టకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది.

సహకారం.. ఇష్టారాజ్యం
ఒంగోలులోని జిల్లా సహకార శాఖ అధికారి కార్యాలయం

నాలుగు పోస్టులు.. ఒకే ఒక్కడు

సహకారశాఖలో విచిత్ర వ్యవహారం

ఇన్‌చార్జి డీసీవో, డీసీఏవోలతోపాటు సూపర్‌బజారు పీఐసీ చైర్మన్‌గా డీఎల్‌సీవో శ్రీనివాసరావు

ఉన్నతాధికారుల ఆశీస్సులతో సాగుతున్న వైనం

స్పందన లేని పాలకవర్గం

సహకార సంస్థల్లో అక్రమాలపై సాగని విచారణలు

జిల్లా సహకార శాఖలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ శాఖ పాలనా వ్యవహారాలను అటు రాష్ట్ర, ఇటు జిల్లా ఉన్నతాధికారులు గాలికొదిలేశారు. రోజువారీ ఇతర శాఖల్లో ఉన్నట్లు కీలక ప్రజాప్రతినిధుల జోక్యం పెద్దగా అందులో లేకపోవడం, అంతకు మించి బాధ్యతగల పాలకపక్ష పెద్దలు దృష్టిపెట్టకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. ఇందుకు ఒక అధికారే నాలుగు కీలక పోస్టుల్లో కొనసాగడం నిదర్శనం. పైగా ఆ డివిజనల్‌ స్థాయి అధికారి ప్రస్తుతం జిల్లాలో సహకార శాఖను నడిపించే కీలకమైన డీసీవో పోస్టులో ఇన్‌చార్జిగా నెలలు తరబడి కొనసాగుతుండటం చర్చనీయాంశమైంది.

ఒంగోలు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వంలోనూ జిల్లా సహకారశాఖ ఇంకా గాడిన పడలేదు. అక్రమ వ్యవహారాలపై విచారణలు ముందుకుసాగడం లేదు. ఇందుకు ఆ శాఖ అధికారుల తీరే కారణమని తెలుస్తోంది. జిల్లాస్థాయిలో మొత్తం సహకార వ్యవస్థ పర్యవేక్షణాధికారిగా జిల్లా సహకార అధికారి (డీసీవో), అలాగే సహకార సంస్థల ఆర్థిక కార్యకలాపాల పర్యవేక్షణకు జిల్లా సహకార ఆడిట్‌ అధికారి (డీసీఏవో) ఉంటారు. అలాగే డివిజన్‌ స్థాయిలో డివిజనల్‌ సహకారశాఖ అధికారి (డీఎల్‌సీవో) ఆ డివిజన్‌ పరిధిలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. జిల్లాలో సహకార రంగంలో ఉండే జిల్లా స్థాయి సంస్థలైన డీసీసీబీ, డీసీఎంఎస్‌, పొగాకు సమాఖ్య, కోల్‌సొసైటీ, ఒంగోలు సూపర్‌బజారుతోపాటు వందలాది ప్రాథమిక సహకార సంఘాలు (పీఎసీఎస్‌)లు, ఇతర సహకార క్రెడిట్‌ సొసైటీలు అన్నింటి పాలన, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ వారి ద్వారానే జరగాలి. అలాంటి కీలకమైన సహకారశాఖకు సంబంధించిన నాలుగు ముఖ్య బాధ్యతల్లో నెలల తరబడి ఒకే అధికారి కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఒంగోలు డీఎల్‌సీవో అయిన శ్రీనివాసరావు అతను రెగ్యులర్‌ అఽధికారైన డీఎల్‌సీవోతోపాటు డీసీవో, డీసీఏవో వంటి జిల్లాస్థాయి కీలక పోస్టుల్లో ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాలకవర్గం లేని ఒంగోలు సూపర్‌ బజారు పర్సన్‌ ఇన్‌చార్జి (పీఐసీ) కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

అన్నింటికి ఒక్కరే..

గతంలో ఇక్కడ ఐదేళ్లు డీసీఏవోగా పనిచేసిన పొలిశెట్టి రాజశేఖర్‌ ఏడెనిమిది మాసాల క్రితం సాధారణ బదిలీల్లో ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. అప్పటికి ఆయన ఒంగోలు డీఎల్‌సీవో పోస్టులో ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. అప్పటి బదిలీల్లో నర్సరావుపేట నుంచి ఇక్కడి డీఎల్‌సీవోగా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆయన వచ్చి బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీసీఏవో పోస్టులో ఎవరినీ నియమించకపోవడంతో ఇన్‌చార్జి డీసీఏవోగా కూడా కొనసాగుతున్నారు. అలా ఏడెనిమిది మాసాలుగా ఇన్‌చార్జి డీఎల్‌సీవోగా కూడా పనిచేస్తున్న ఆయన్ను నెలన్నర క్రితం ఇక్కడి డీసీవో శ్రీలక్ష్మి సెలవుపై వెళ్లడంతో ఇన్‌చార్జి డీసీవోగా కూడా ఉన్నతాధికారులు నియమించారు. అప్పటికే ఆయన ఒంగోలు సూపర్‌బజారు పీఐసీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా అధికారుల బదిలీలు జరిగినప్పుడు ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో స్థానికంగా పనులకు ఆటంకం కలగకుండా ఇటు కలెక్టర్‌, అటు ఉన్నతాధికారులు ఇన్‌చార్జి బాధ్యతలు అందుబాటులో ఉన్న వారికి అప్పగిస్తుంటారు. కొద్దిరోజులు అలా చేసి తిరిగి ఆ స్థానాలను భర్తీ చేస్తారు. కానీ సహకార శాఖలో మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోంది.

రాష్ట్రస్థాయి అధికారులపైనే అనుమానం

జిల్లాలో డీసీసీబీ, కోల్‌సొసైటీ, డీసీఎంఎస్‌ వంటి కీలక సంస్థల్లో గత వైసీపీ ప్రభుత్వంలో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై విచారణలు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో నిష్పక్షపాతంగా, నిబద్ధతతో పనిచేసే అధికారులు సహకారశాఖలో అవసరం. అయితే కీలక పోస్టులన్నింటిలోనూ డివిజనల్‌స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా కొనసాగించడం వెనుక రాష్ట్రస్థాయి ఆ శాఖ అధికారుల హస్తం ఉందని తెలుస్తోంది. ఇక్కడి సంస్థల్లో సాగుతున్న విచారణలు ముందుకు సాగకుండా ఉన్నతాధికారులు అడ్డుపడుతున్నారన్న ప్రచారం సహకార వర్గాల్లో సాగుతోంది. అంతేకాక గతేడాది ఫిబ్రవరిలో జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధుల ఫిర్యాదుతో అప్పటి డీసీవో శ్రీనివాసరెడ్డిని నాటి కలెక్టర్‌ అన్సారియా సరెండర్‌ చేశారు. అప్పుడు మూడు వారాలపాటు ఇన్‌చార్జిగా ఉన్నతాధికారులు ఎవరినీ నియమించకపోవడంతో పీడీసీసీ బ్యాంకులో ఓఎస్‌డీగా ఉన్న ఇందిరాదేవికి ఇన్‌చార్జికి డీసీవోగా కలెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు. అందుకు మూడు నెలలపాటు ఆఽథరైజేషన్‌ను సహకారశాఖ ఉన్నతాధికారులు ఇవ్వలేదు. ఆశాఖ ఉద్యోగులకు జీతాలు రాక రోడ్డెక్కడం, అధికారుల తీరును ఎండగడుతూ ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు రావడం, చివరకు మంత్రి నారా లోకేష్‌ దృష్టికి వ్యవహారం చేరడంతో సీఎం కార్యాలయ జోక్యం చేసింది. దీంతో మూడున్నర మాసాలకు ఇందిరాదేవికి ఆథరైజేషన్‌ ఇచ్చారు. అనంతరం కొద్ది కాలానికి ఇక్కడి డీసీవోగా శ్రీలక్ష్మిని నియమించారు. అయితే ఆమె ఎక్కువ కాలం పనిచేయలేదు.

కావాలనే కొనసాగింపా..?

గతనెల తొలివారంలో డీసీవో సెలవుపై వెళ్లగా ఇన్‌చార్జి డీసీవోగా ఇక్కడ డీఎల్‌సీవోగా ఉన్న శ్రీనివాసరావును మరుసటిరోజే ఉన్నతాధికారులు నియమించారు. గతంలో శ్రీనివాసరెడ్డిని అప్పటి కలెక్టర్‌ సరెండర్‌ చేసినప్పుడు పట్టించుకోకుండా వదిలేసి, తర్వాత కలెక్టర్‌ ఇన్‌చార్జిగా నియమించిన ఇందిరాదేవికి పవర్‌ ఇవ్వకుండా మోకాలొడ్డిన ఉన్నతాధిఽకారులు ప్రస్తుతం డీఏల్‌సీవోగా ఉన్న శ్రీనివాసరావును కీలకమైన జిల్లా అధికారుల పోస్టులలో నెలల తరబడి కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేసమయంలో కీలకమైన జిల్లాస్థాయి సహకార సంస్థలపై చేపట్టిన విచారణలు ముందుకు సాగకపోవడానికి కూడా ఉన్నతాధికారుల తీరే కారణమన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాగా సహకారశాఖలో ఇలాంటి పరిస్థితి కి జిల్లాకు చెందిన పాలకపక్షంలోని పెద్దలు దృష్టిసారించకపోవడం ప్రధాన కారణంగా చర్చ సాగుతోంది.

Updated Date - Mar 18 , 2026 | 02:53 AM