మా ప్రాంత అభివృద్ధికి చేయూతనివ్వండి
ABN , Publish Date - Mar 09 , 2026 | 10:58 PM
కనిగిరి ప్రాంతం సంక్షోభం నుంచి సుభిక్షం వైపు అడుగులు పడేలా కనికరించాలని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర కోరారు.
కంచి కామకోటి పీఠాధిపతిని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
కనిగిరి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : కనిగిరి ప్రాంతం సంక్షోభం నుంచి సుభిక్షం వైపు అడుగులు పడేలా కనికరించాలని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర కోరారు. పొదిలి మండలంలోని ఓబులక్కపల్లె గ్రామం శంకర విద్యాలయం సందర్శనకు వచ్చిన స్వామీజీని ఎమ్మెల్యే ప్రత్యేకంగా కలసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే స్వామీజీకి కనిగిరి ప్రాంత పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు, సంక్షేమ ఫలాలను, చేస్తున్న పనులను విశ్లేషించారు. కనిగిరి ప్రాంతం ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం కావటంతో ఇక్కడి ప్రజలు కిడ్నీ వ్యాధులతో అల్లాడిపోతున్నారని స్వామీజీ దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆరోగ్యం కోసం మంచి వైద్యసేవలు అందించేలా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. కనిగిరి మండల పరిధిలోని పామూరు రోడ్డులో బల్లిపల్లి వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటు ప్రాంతంలో అరుణాచలగిరి ప్రదక్షిణ మాదిరిగా ఆలయం నిర్మించేందుకు అనువైన స్థలం ఉందని స్వామీజీకి తెలిపారు. ఒకసారి ఆయా భూమిని పరిశీలించాలని కోరారు. దీంతో పీఠాధిపతి విజయేంద్రసరస్వతి స్వామీజీ వారు కనిగిరి ప్రాంతంలోని ట్రిపుల్ ఐటీ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొండా కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీ ప్రాంతం ఆలయనిర్మాణానికి అనుకూలం
అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విజయేంద్రసరస్వతి
మండల పరిధిలోని బల్లిపల్లి వద్ద ఉన్న ట్రిపుల్ ఐటీ ప్రాంతం ఆలయ నిర్మాణానికి అనుకూలమైన ప్రాంతమని కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర కోరిక మేరకు సోమవారం రాత్రి స్వామీజీ ట్రిపుల్ ఐటీ ప్రాంతాన్ని సందర్శించారు. స్థలాన్ని పరిశీలించిన స్వామీజీ మాట్లాడుతూ ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో ఈ ప్రాంతం నెలకొందన్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణ దేవాలయం మాదిరిగా ఇక్కడ కూడా నిర్మాణం చేపట్టాలన్నది తన సంకల్పంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర స్వామీజికి వివరించగా, ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.