అర్ధంతరంగా వదిలేసిన కాంట్రాక్టర్లు
ABN , Publish Date - Sep 02 , 2026 | 10:58 PM
ముండ్లమూరు మండలంలోని పలు గ్రామాలలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒకేచోట గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రం నిర్మించేందుకు జాతీయ ఉపాధి పథకం నిధులు మంజూరు చేసింది.
ముండ్లమూరు మండలంలో అసంపూర్తిగా గ్రామ సచివాలయ భవనాలు
గత వైసీపీ హయాంలో పనులు ఆగినా పట్టించుకోని అధికారులు
అద్దెభవనాల్లో కొనసాగుతున్న పాలన
ముండ్లమూరు మండలంలోని పలు గ్రామాలలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒకేచోట గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రం నిర్మించేందుకు జాతీయ ఉపాధి పథకం నిధులు మంజూరు చేసింది. గ్రామ సచివాలయం నిర్మాణానికి రూ. 35 నుంచి రూ. 40లక్షలు, రైతు భరోసా కేంద్రానికి రూ.21లక్షలు, ఆరోగ్య ఉపకేంద్రానికి రూ.17లక్షలు మంజూరయ్యాయి. పూరిమెట్లలో గ్రామ సచివాలయ భవనం అసంపూర్తిగా ఉండిపోయింది. దీంతో సచివాలయ పక్కనే ఉన్న రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. శంకరాపురంలో రైతు భరోసా కేంద్రం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఉమామహేశ్వరపుర అగ్రహారంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రం భవనాలు అసంపూర్తిగా ఉండిపోయాయి. కేవలం 50శాతం మాత్రమే పనులు జరిగాయి. ఆ గ్రామంలో పాఠశాల భవనంలో విధులు నిర్వహిస్తున్నారు. సింగనపాలెంలో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం ఆరోగ్య ఉపకేంద్రం పునాదులకే పరిమితమైపోయింది. పులిపాడులో కూడా రైతు భరోసా కేంద్రం ఆరోగ్య ఉపకేంద్రం పునాదులకే పరిమితమైంది. పసుపుగల్లులో రైతు భరోసా కేంద్రం అసంపూర్తిగా ఉండిపోయింది. ఆరోగ్య ఉపకేంద్రం పనులు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీలో అసంపూర్తిగా ప్రభభుత్వ భవనాలు నిర్మాణాలు ఉండిపోవడంతో సచివాలయ సిబ్బంది అగ్రికల్చర్ సిబ్బంది వైద్యానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -ముండ్లమూరు, (ఆంధ్రజ్యోతి)