ఉపాధిహామీ పథకాన్ని తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:48 PM
కాంగ్రెస్ హాయాంలో ఉపాధి అంటే ఒక హక్కుగా చట్టం చేసి పథకం తెచ్చి పేదలకు పని కల్పించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి అన్నారు.
ఇంకొల్లు, మార్చి 3, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ హాయాంలో ఉపాధి అంటే ఒక హక్కుగా చట్టం చేసి పథకం తెచ్చి పేదలకు పని కల్పించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి అన్నారు. జాతీయ ఉపాధి హామీ పరిరక్షణయాత్రలో భాగంగా ఇంకొల్లులో బుధవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కాంట్రాక్టర్ల చేతుల్లో పెడుతున్నారన్నారు. వీబీజీ రామ్‌బీ పేరుతో ఉపాధి కూలీల పొట్టగొట్టే విధానాలు అమలు జేస్తోందన్నారు. దీనిలో ఉపాధి గ్యారంటీ లేదన్నారు. ప్రస్తుతం 100 రోజుల పనే సక్రమంగా చూపకుండా 125 పని కలిపిస్తామని బూటకం మాటలు చేప్పి ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. కాంగ్రెసు తెచ్చిన మహాత్మాగాంధీ ఉపాధిహామీ పనిలో 90శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వాలు 40 శాతం భరాయించాల్సి రావడంపై వాటిపై పెనుభారంగా మారుతోందన్నారు. ఈ చట్టాన్ని వెంటనే ప్రధాని మోదీ రద్దు చేయాలని డిమాండ్ చేశా రు. ప్రజలు చెప్పిన పలు సమస్యలను విన్నారు. ఫించన్లు, ఉపాధిహామీలో లోపాల గురించి ప్రజలు షర్మిలకు విన్నవించారు. కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెడి శీలం, ఏపీ కిసాన్ కాంగ్రెసు చైర్మన్ కామన ప్రభాకరరావు, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త శివజ్యోతి, పీసీసీ ప్రధానకార్యదర్శి తాడికొండ వెంకటేశ్వర్లు, గంటా అంజిబాబు, పోతిన సంపత్‌కుమార్, షేక్ మస్తాన్‌వలి, స్ధానిక నాయకులు షేక్ మోదీన్‌బాషా, షేక్ ఈసూబు, జానకిరామారావు, రహీం, ఇమాంసా, మాబుల్లా, సలాం కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల నెట్టిన జగన్, చంద్రబాబు
ఇంకొల్లు : ఆంధ్రరాష్ట్రాన్ని అప్పుల ఊబిలోనికి తీసుకెళ్లిన ఘనత జగన్, చంద్రబాబులదేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ ఇచ్చిన హామీ ఏమి నెరవేర్చక పోగా కూటమి ప్రబుత్వం బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఆంతర్యామేమిటని ప్రశ్నించారు. జగన్, చంద్రబాబునాయుడు ఇద్దరు కలసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. సుమారు రూ.11లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జాబ్‌కార్డులు రద్దు చేశారని, కొత్తగా ఫించన్లు ఇవ్వడం లేదని అన్నారు. మోదీ మన రాష్ట్రానికి అప్పులు ఇవ్వడం మినహా అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదన్నారు. విభజన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. రాజశేఖరరెడ్డి హయాంలోనే రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని అన్నారు.