Share News

వెలిగొండను పూర్తిచేసిన ప్రభుత్వానికి అభినందనలు

ABN , Publish Date - Sep 08 , 2026 | 02:55 AM

నాలుగు జిల్లాల ప్రజలకు మేలు చేకూర్చే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలు విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నానని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ కె.నారాయణ అన్నారు. ఆపార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ఆయన సోమవారం వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు.

వెలిగొండను పూర్తిచేసిన ప్రభుత్వానికి అభినందనలు

ప్రాజెక్టు కోసం పోరాడిన పూల సుబ్బయ్య

టన్నెల్‌ వద్ద ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలి

సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ

మార్కాపురం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : నాలుగు జిల్లాల ప్రజలకు మేలు చేకూర్చే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలు విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నానని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ కె.నారాయణ అన్నారు. ఆపార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ఆయన సోమవారం వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు. దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ఫీడర్‌ కాలువను పరిశీలించి, అందులో నీటి ప్రవాహాన్ని చూసి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. అనంతరం మార్కాపురం చేరుకున్న ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెలిగొండ కోసం సీపీఐ నాయకుడు పూల సుబ్బయ్య అనేక పోరాటాలు చేసి ఈ ప్రాంత ప్రజలకు కృష్ణా జలాలు రప్పించడం ద్వారా ఒనగూరే మేలును ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఆయన వినతికి స్పందించి మొదటిగా సర్వేకోసం జీవో విడుదల చేయించిన ఘనత ఎన్‌టీ రామారావుకు దక్కుతుందన్నారు. ఎవరికి వారు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ వెలిగొండ క్రెడిట్‌ తమదే అని చెప్పుకుంటున్నా తొలి పోరాటం సీపీఐదేనన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్‌టీ రామారావు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు, జగన్‌ ఎవరి పాత్ర వారు పోషించారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రాజెక్టు కోసం పాటుపడిన పూల సుబ్బయ్య విగ్రహాన్ని వెలిగొండ టన్నెల్‌ వద్ద ఏర్పాటు చేయాలని సీపీఐ తరపున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరించాలని, పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. రెండో దశ పనులను కూడా పూర్తిచేసి సాగు, తాగు నీరు అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల వెలిగొండ ఫీడర్‌ కాలువలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీపీఐ చేసిన పోరాటాల వల్ల సాకారమైన వెలిగొండ ద్వారా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు సయ్యద్‌ యాసిన్‌, అందె నాసరయ్య, కేవీ కృష్ణగౌడ్‌, దేవెండ్ల శ్రీను, రవీంద్రబాబు, బి.రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 02:55 AM