Share News

క్షుద్రపూజల కలకలం

ABN , Publish Date - Jul 14 , 2026 | 03:07 AM

క్షుద్రపూజల కారణంగా దివ్యాంగ బాలుడు మృతిచెందిన ఘటన ఒంగోలులో ఆలస్యంగా వెలుగుచూసింది. గుట్టుచప్పుడు కాకుండా బాలుడిని ఖననం చేసిన తండ్రి, పూజలు చేసిన మహిళ పరారయ్యారు.

క్షుద్రపూజల కలకలం
ఇంటిలో పూజలు చేసిన ప్రదేశం

మహిళ హింసకు ఏడేళ్ల దివ్యాంగ బాలుడు మృతి

పరారీలో పూజలు చేసిన మహిళ, బాలుడి తండ్రి

ఒంగోలులో ఘటన.. ఆందోళనలో స్థానికులు

ఒంగోలుక్రైం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): క్షుద్రపూజల కారణంగా దివ్యాంగ బాలుడు మృతిచెందిన ఘటన ఒంగోలులో ఆలస్యంగా వెలుగుచూసింది. గుట్టుచప్పుడు కాకుండా బాలుడిని ఖననం చేసిన తండ్రి, పూజలు చేసిన మహిళ పరారయ్యారు. ఈ ఘటన నగరంలోని గోపాల్‌నగర్‌ మొదటి లైన్‌ ఎక్స్‌టెన్షన్‌లో ఈనెల 11న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం గోపాల్‌నగర్‌ మొదటిలైన్‌ ఎక్స్‌టెన్షన్‌లో కటారి కిరణ్‌ అనే వ్యక్తి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అతనికి ఏడేళ్ల దివ్యాంగ కొడుకు ఉన్నాడు. పోలియోతో రెండు కాళ్లూ పనిచేయని బాలుడికి క్షుద్రపూజలు చేసి నడిపిస్తానని చెప్పి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ రెండు నెలల క్రితం కిరణ్‌ ఉంటున్న ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె బాలుడి చేతులు కట్టివేసి పూజలో భాగంగా అతనిని కొడుతూ ఉండేదని స్థానికులు చెబుతున్నారు. బాలుడి కేకలు, మంత్రాలు వినిపించకుండా పెద్దగా పాటలు పెట్టేవారు. పూజ పేరుతో మహిళ పెట్టిన హింసకు బాలుడు స్పృహతప్పి శనివారం మృతిచెందాడు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఆదివారం శ్మశానంలో ఖననం చేశారు. అయితే ఈ పరిస్థితిని చూసిన స్థానికులు ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కిరణ్‌, అతని భార్యను పిలిచి విచారించగా తమ కుమారుడు అనారోగ్యంతో మృతిచెందినట్లు రాతపూర్వకంగా తెలిపారు. అయితే సోమవారం రాత్రి కొందరు స్థానికులు క్షుద్రపూజల నేపథ్యంలోనే బాలుడు మృతిచెందాడని మీడియాకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు వచ్చింది. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అక్కడికి వచ్చి సమాచారం సేకరించారు. అయితే స్థానికులు క్షుద్రపూజల నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కిరణ్‌, క్షద్రపూజలు చేసిన మహిళ పరారీలో ఉన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 03:07 AM