Share News

ఇన్విజిలేటర్ల నియామకంలో గందరగోళం

ABN , Publish Date - Mar 14 , 2026 | 02:59 AM

ఉమ్మడి జిల్లాలో ఈనెల 16వతేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్ల నియామకంలో గందరగోళం నెలకొంది. కొన్ని హైస్కూళ్లలో ఒక్కరికి కూడా ఇన్విజిలేషన్‌ డ్యూటీ రాకపోగా కొన్ని పాఠశాలల్లో మాత్రం ఒకరిద్దరు మినహా మిగిలిన అందరినీ నియమించారు.

ఇన్విజిలేటర్ల నియామకంలో గందరగోళం

సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పెద్దపీట

వారి స్కూల్‌ పిల్లలు రాస్తున్న సెంటర్లకే కేటాయించడంపై అనుమానాలు

ఒంగోలు విద్య, మార్చి 13 (ఆంధ్ర జ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ఈనెల 16వతేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్ల నియామకంలో గందరగోళం నెలకొంది. కొన్ని హైస్కూళ్లలో ఒక్కరికి కూడా ఇన్విజిలేషన్‌ డ్యూటీ రాకపోగా కొన్ని పాఠశాలల్లో మాత్రం ఒకరిద్దరు మినహా మిగిలిన అందరినీ నియమించారు. ప్రైవేటు టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమించడంలో భారీగా తప్పులు దొర్లాయి. ఆటోమేషన్‌ విధానంలో ఇలా జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఎస్‌జీటీలకు పెద్దపీట

పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో ప్రాథమిక పాఠశా లల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పెద్దపీట వేశారు. మొదట ఎస్జీటీలను ఇన్విజిలేటర్లుగా నియమించేది లేదని కమిషనర్‌ తెలిపారు. ఆచరణలో అందుకు విరుద్ధంగా కొన్ని పరీక్షా కేంద్రాలకు కేవలం వారినే ఇన్విజిలేటర్లుగా నియమించారు. చీమకుర్తిలోని పరీక్షా కేంద్రాలకు అందరూ ఎస్జీటీలనే నియమించారు. ఒంగోలు నగరపరిధిలోని త్రోవగుంట జడ్పీ హైస్కూలులో 1 నుంచి 5 తరగతులను బోధించేందుకు ముగ్గురు ఎస్జీటీలు పనిచేస్తుండగా ముగ్గురికీ ఇన్విజిలేషన్‌ డ్యూటీలు వేశారు. అక్కడ ప్రాథమిక తరగతులు ఎవరు బోధించాలో తెలియని పరిస్థితి. ప్రాథమిక పాఠశాలల్లో జీఎఫ్‌ఎల్‌ఎన్‌ 75రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నందున ఎస్జీటీలను ఇన్విజిలేటర్లుగా నియమించరాదని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం వారినే ఎక్కువగా నియమిం చడం పట్ల పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హైస్కూళ్లలో పనిచేస్తున్న సబ్జెక్టు టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమించడం చూస్తే అతివృష్టి, అనావృష్టి సామెత గుర్తుకు తెస్తోంది. కొన్ని పాఠశాలల్లో ఒక్కరిని కూడా ఇన్విజిలేటర్లుగా నియమించకపోగా మరికొన్ని పాఠశాలల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన అందరినీ నియమించారు. పరీక్షలు మొదటి మూడు రోజులు తెలుగు, హిందీ, ఇంగ్లీషు సబ్జెక్టులకు గ్రూపు సబ్జెక్టుల వారిని, గ్రూపు సబ్జెక్టుల పరీక్షలకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు సబ్జెక్టు టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నట్లు తొలుత ప్రకటించారు. అవసరమైతే 25 శాతం ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను నియమిస్తామన్నారు. ఒంగోలులోని త్రోవగుంట జడ్పీ హైస్కూలులో ఇద్దరు మినహా అందరినీ నియమించారు. ఇద్దరితో పాఠశాల నిర్వహించడం ఎలా అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారిని ఇన్విజిలేటర్లుగా నియమించడంలో గందరగోళం నెలకొంది. ప్రైవేటు టీచర్లను తాము పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులు పరీక్ష రాస్తున్న కేంద్రాలకే నియమించడంతో సమస్య తలెత్తింది. ఒంగోలులో 30మంది ప్రైవేటు టీచర్లు తాము పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులు పరీక్షలు రాస్తున్న కేంద్రాలకే నియమితులయ్యారు. చీమకుర్తిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి అసంబద్ధాలను సవరించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

Updated Date - Mar 14 , 2026 | 02:59 AM