టీచర్ల సర్దుబాటులో గందరగోళం
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:02 AM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పనిసర్దుబాటులో గందరగోళం నెలకొంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీచేసిన ఉత్తర్వుల ప్రక్రియ ముందుకు సాగకుండా పోయింది. టీచర్ల సర్దుబాటుకు సంబంధించిన జాబితాలు ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు.
ముందుకు సాగని ప్రక్రియ
కొలిక్కిరాని జాబితాలు
అటకెక్కిన షెడ్యూల్
ఒంగోలు విద్య, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పనిసర్దుబాటులో గందరగోళం నెలకొంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీచేసిన ఉత్తర్వుల ప్రక్రియ ముందుకు సాగకుండా పోయింది. టీచర్ల సర్దుబాటుకు సంబంధించిన జాబితాలు ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు. దీంతో ఆ షెడ్యూల్ అటకెక్కింది. సర్దుబాటుకు సంబంధించిన విధివిధానాల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకోవడంతో క్షేత్రస్థాయిలో అధికారులు తలలుపట్టుకుం టున్నారు. జాబితాల తయారీలో అనివార్యంగా జాప్యం నెలకొంది. విద్యాశాఖ మార్గదర్శకాలు జారీచేసి ఐదు రోజులు గడుస్తున్నా అడుగుముందుకు పడలేదు. ఈనెల 20వతేదీ నాటి విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా పాఠ శాలల్లో మిగులు టీచర్లు, అదనంగా అవసరమయ్యే వారి వివరాలను గుర్తించే బాధ్యతను విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలోని ఐటీ విభాగానికి అప్పగించారు. వారు ఈనెల 25న పాఠశాలల్లో మిగులు, అదనంగా అవసరం ఉన్న టీచర్ల వివరాలను ఎంఈవోల లాగిన్‌లో పెట్టారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 దాటితే ఒక పీఎస్ హెచ్‌ఎం, నలుగురు ఎస్‌జీటీలను ఇవ్వాల్సి ఉండగా ఆ పాఠశాలల్లో ఒక ఎస్‌జీటీని మిగులుగా చూపించారు. దీంతో ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో దానిని సవరించారు. కొత్తగా హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ అయిన పాఠశాలలకు నిబంధనలకు విరుద్ధంగా రెండు పీఈటీ పోస్టులు అవసరమని చూపించారు. పాఠశాలల్లో పీఈటీ పోస్టులన్నింటిని గ్రేడ్-2 పీడీలుగా అప్‌గ్రేడ్ చేశారు. అవసరమైన విద్యార్హతలు లేని వారు మాత్రమే పీడీ పోస్టుల్లో పీఈటీలుగా పనిచేస్తున్నారు. మోడల్‌ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఎస్ హెచ్‌ఎం పోస్టును కొనసాగించమన్నారు. ఈ క్రమంలో బేసిక్ ప్రైమరీ స్కూళ్లుగా భావించి వాటికి ఐదు ఎస్జీటీలను ఇమ్మన్నారు. లాగిన్‌లో ఈ మార్పు చేసేందుకు అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈవిధంగా ఎప్పటికప్పుడు మార్గదర్శకాల్లో మార్పులు చేస్తుండటంతో ప్రక్రియ అడుగు ముందుకు పడటం లేదు. మారిన మార్గదర్శకాల ప్రకారం ఎంఈవోలు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ డీఈవో లాగిన్‌కు పంపడం అక్కడ డీఈవో కార్యాలయ ఐటీ విభాగం వీటిని ధ్రువీకరించి డైరెక్టర్ కార్యాలయానికి పంపించడం పరిపాటైంది.
అటకెక్కిన షెడ్యూల్
ఉపాధ్యాయుల పనిసర్దుబాటుకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించిన మొదటిరోజు నుంచే ఉల్లంఘనలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 23న మిగులు టీచర్లు, అదనంగా కావాల్సిన వివరాలు ప్రకటించి ఎంఈవో లాగిన్‌లో ఉంచాలి. 4న ఎంఈవోలు ఆ వివరాలను ధ్రువీకరించి డీఈవో లాగిన్‌కు పంపాలి. అదేరోజు డీఈవో డైరెక్టర్ కార్యాలయానికి పంపాలి. 25న పని సర్దుబాటు టీచర్ల సీనియారిటీ జాబితాలు ప్రకటించి 26న ఎంఈవోలు మండల స్థాయిలో పనిసర్దుబాటును పూర్తిచేయాలి. అయితే ఎంఈవోలకు ఈనెల 25న తప్పులతడకగా జాబితాలు అందాయి. వాటిని సవరించి 26న డీఈవోకు పంపారు. అప్పటినుంచి అనేక మార్పులు చోటుచేసుకోవడంతో జాబితాలు డీఈవో లాగిన్‌లోనే ఉండిపోయాయి. దీంతో మొత్తంగా ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. డైరెక్టర్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 30 నాటికి సర్దుబాటు పూర్తికావాల్సి ఉండగా ఆ పరిస్థితి కనిపించడం లేదు.