ని‘బంధనాలు’
ABN , Publish Date - May 06 , 2026 | 02:40 AM
మండలంలోని జేపీచెరువు సమీప నల్లమల అడవిలో ఉన్న ప్రముఖ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానం అభివృద్ధికి అటవీ నిబంధనలు అడ్డంకిగా మారాయి. భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా అందుకు అనుగుణంగా అధికారులు సౌకర్యాలు కల్పించలేక పోతున్నారు.
నిధులున్నా కదలని విస్తరణ పనులు
విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు లేక మహిళా భక్తుల అవస్థలు
అనుమతుల కోసం ఎదురుచూపులు
రాచర్ల, మే 5 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని జేపీచెరువు సమీప నల్లమల అడవిలో ఉన్న ప్రముఖ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానం అభివృద్ధికి అటవీ నిబంధనలు అడ్డంకిగా మారాయి. భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా అందుకు అనుగుణంగా అధికారులు సౌకర్యాలు కల్పించలేక పోతున్నారు. టీటీడీ నిధులు మంజూరు చేసినప్పటికీ అటవీ అనుమతులు తప్పనిసరికావడంతో పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. నెమలిగుండ్ల క్షేత్ర అభివృద్ధికి టీటీడీ గతంలో సుమారు రూ.6కోట్లు మంజూ రు చేసింది. ఈ నిధులతో భక్తులకు వసతి గదులు, మౌలిక సదుపాయాల కల్పనకు దేవదాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే దేవస్థాన ప్రాంతం నాగార్జున సాగర్ శ్రీశైలం టైౖగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండటంతో ప్రతి చిన్న అభివృద్ధి లేదా నిర్మాణ పనులకు అటవీ, పర్యావరణ అనుమతులు తప్పనిసరి అయ్యాయి. దీంతో నిధులు ఉన్నప్పటికీ పనులు చేపట్టలేక ఆలయ అధికారులు చేతులెత్తేస్తున్నారు.
భక్తులకు తప్పని ఇక్కట్లు
నెమలిగుండ్ల క్షేత్రానికి వచ్చే భక్తులు అక్కడ అవసరమైన సౌకర్యాలు కరువై అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు లేకపోవడం సమస్యగా మారింది. ఆలయానికి మహిళలు అధిక సంఖ్యలో వస్తుంటారు. లక్ష్మమ్మ వనం వద్ద విశ్రాంతి తీసుకునే భక్తులకు కనీసం ఒక్క మరుగుదొడ్డి కూడా అందుబాటులో లేదు. దీంతో మహిళలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. నెమలిగుండం నుంచి శిఖరం వరకూ ఉన్న క్యూలైన్ చాలా ఇరుకుగా ఉంది. అభివృద్ధి పనుల్లో దీన్ని విస్తరించాలని ప్రతిపాదించారు. ఆలయం చుట్టూ కొండ కావడంతో ఆ ప్రాంతమంతా ఇరుకుగా ఉంటుంది. దీంతో భక్తులు అవస్థపడుతున్నారు. ఈదృష్ట్యా ఆలయ ప్రాంగణాన్ని మరింత విశాలంగా చేయాలని అధికారులు భావించారు. కానీ అటవీ నిబంధనల కారణంగా ఒక్క పని కూడా చేపట్టలేకపోయారు.
సర్వేలో తీవ్రజాప్యం
అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు లభించాలంటే ముందుగా డీజీపీఎస్ సర్వే ప్రక్రియను అటవీశాఖ అధికారులు చేయాల్సి ఉంది. ఆతర్వాత అటవీ భూముల బదలాయింపు లేదా వినియోగంపై కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు ఆన్‌లైన్ ద్వారా ఆలయ అధికారులు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఆలయ అధికారులు పలు దఫాలు అటవీశాఖ ఉన్నతాధికారులను కలిసి దేవస్థానం విస్తరణ, అవసరమైన భూమి కేటాయింపు గురించి వివరించారు. కానీ ఇప్పటి వరకూ సర్వే చేపట్టకపోవడంతో అభివృద్ధి పనులకు అవరోధంగా మారింది.
ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే ముత్తుముల చొరవ
దేవస్థానం అభివృద్ధికి నోచుకోకపోవడం, భక్తులు ఇబ్బందులు పడుతుండటాన్ని చూసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్పందించారు. క్షేత్ర ప్రాముఖ్యత, ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ అటవీశాఖ ఉన్నతాధికారులకు కొద్దిరోజుల క్రితం లేఖ రాశారు. అవసరమైన అనుమతులు ఇవ్వాలని అందులో కోరారు. మరోవైపు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఇటు ప్రభుత్వ పెద్దలను, ఇటు సంబంధిత అధికారులను పలుమార్లు కలిసి నెమలిగుండ్లలో అభివృద్ధి పనులకు ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కూడా కలిసి నెమలిగుండ్ల క్షేత్ర అభివృద్ధిపై చర్చించారు. అయినప్పటికీ అటవీ అధికారుల్లో చలనం కరువైంది. అటవీశాఖ కొర్రీలు తొలగి, కేంద్రం పచ్చజెండా ఊపితే నెమలిగుండ్లలో భక్తుల ఇక్కట్లు తీరతాయి. ఆలయం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆదిశగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.