Share News

వడ్డెర సంఘాలకు గనుల కేటాయింపులో రాయితీలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:02 AM

రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర సంఘాలకు భారీ భరోసా కల్పించింది. గనుల లీజు, సీనరేజీలలో 50శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రత్యేకంగా భూకేటాయింపులు చేసింది.

వడ్డెర సంఘాలకు గనుల కేటాయింపులో రాయితీలు

ప్రకాశంలో బిల్డింగ్‌ స్టోన్‌, మార్కాపురంలో రోడ్డు మెటల్‌, బిల్డింగ్‌ స్టోన్‌

తొలి దశలో రాష్ట్రవాప్తంగా 100 హెక్టార్లు కేటాయింపు

లీజు, సీనరేజీలలో 50శాతం రాయితీ

ఒంగోలు క్రైం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర సంఘాలకు భారీ భరోసా కల్పించింది. గనుల లీజు, సీనరేజీలలో 50శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రత్యేకంగా భూకేటాయింపులు చేసింది. వడ్డెరులు సంఘాలుగా ఏర్పడితే గనులు పొందవచ్చు. రాష్ట్రంలో తొలివిడత 100 హెక్టార్ల భూమిని వారికి కేటాయించింది. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలం పల్లామల్లి వద్ద 5 హెక్టార్లు బిల్డింగ్‌ స్టోన్‌ కోసం, మార్కాపురం జిల్లాలో యడవల్లి వద్ద 3.047 హెక్టార్లు రోడ్డు మెటల్‌, బిల్డింగ్‌ స్టోన్‌, గ్రావెల్‌ తవ్వకాలకు, కనిగిరి మండలం పునుగోడు కండ్రిగలలో 2.261 హెక్టార్లలో ఫెన్సింగ్‌ స్టోన్స్‌కు అవకాశం కల్పించింది. ఆ భూములలో గనుల తవ్వకాలకు వడ్డెర సంఘాల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేటాయించిన భూములలో ఇప్పటికే ఎవరైనా దరఖాస్తు చేసి ఉంటే ఆయా వడ్డెర సంఘాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

50 శాతం రాయితీ

వడ్డెర సంఘాలకు కేటాయించిన గనుల లీజు, సీనరేజీలలో 50శాతం రాయితీ ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు మెటల్‌, బిల్డింగ్‌ స్టోన్‌, గ్రావెల్‌, ఫెన్సింగ్‌ రాళ్ల తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో 25మంది సభ్యులతో వడ్డెరులు సంఘంగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆతర్వాత వారికి క్వారీలను కేటాయిస్తారు.

Updated Date - Sep 12 , 2026 | 03:02 AM