తుఫాన్ నష్టం అంచనాలను సమగ్రంగా తయారు చేయాలి
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:15 PM
అధికారులు సమన్వయంతో పనిచేసి మురసు తుఫాన్ నష్టం అంచనాలు సమగ్రంగా తయారు చేయాలని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల విద్యుత్, వ్యవసాయ అధికారులతో పాటు నియోజకవర్గ ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులతో మంత్రి రవికుమార్ బుధవారం సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం వద్ద క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు.
పంటలు ఎండకుండా వ్యవసాయ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలు వేగంగా చేపట్టాలి
అధికారులు సమన్వయంతో పనిచేయాలి : మంత్రి రవికుమార్
సంతమాగులూరు(అద్దంకి), నవంబరు11(ఆంధ్రజ్యోతి): అధికారులు సమన్వయంతో పనిచేసి మురసు తుఫాన్ నష్టం అంచనాలు సమగ్రంగా తయారు చేయాలని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల విద్యుత్, వ్యవసాయ అధికారులతో పాటు నియోజకవర్గ ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులతో మంత్రి రవికుమార్ బుధవారం సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం వద్ద క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాన్‌తో నష్టపోయిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు చేపడతామని చెప్పారు. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. దెబ్బతిన్న వరి, పత్తి, మిరప, మినుము, శనగ, పొగాకు తదితర పంటల నష్టాన్ని గుర్తించటంతో పాటు దెబ్బతిన్న విస్తీర్ణం, నష్టపోయిన రైతుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని చెప్పారు. విద్యుత్ పునురుద్ధరణ పనులు అత్యధికశాతం పూర్తయినందున, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్ లైన్‌ల మరమ్మతులను మరింత వేగవంతం చేయాలన్నారు. దెబ్బతిన్న ప్రధాన రోడ్లతో పాటు గ్రామీణ రోడ్లు పునరుద్ధరణ కు చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం, బాపట్ల జిల్లా వ్యవసాయాధికారులు శ్రీనివాసరావు, లక్ష్మి, జిల్లా హార్టికల్చర్ అధికారులు ఖలీల్, గోపిచంద్, ఏడీఏ ఎఫ్రాయం, మండల వ్యవసాయశాఖ అధికారులు, విద్యుత్ ఎస్‌ఈలు కట్టా వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, ఈఈ అశోక్‌కుమార్, డీఈలు దామోదర్, శివప్రసాద్ పాల్గొన్నారు,