Share News

నిర్దేశిత గడువులోపు వెలిగొండ పూర్తి

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:37 AM

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్‌ విజయసునీత తెలిపారు. వెలిగొండ పనులను ఆమె జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసులుతో కలిసి బుధవారం పరిశీలించారు.

నిర్దేశిత గడువులోపు వెలిగొండ పూర్తి
వెలిగొండ టన్నెల్‌ లోపలికి వెళ్లి పనుల వివరాలను తెలుసుకుంటున్న కలెక్టర్‌ విజయసునీత

మార్కాపురం కలెక్టర్‌ విజయసునీత

పనుల పరిశీలన

పెద్దదోర్నాల, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్‌ విజయసునీత తెలిపారు. వెలిగొండ పనులను ఆమె జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసులుతో కలిసి బుధవారం పరిశీలించారు. తొలుత రెండో సొరంగం అంతర్భాగంలో కొంతదూరం వెళ్లిన ఆమెకు ఇంజనీరింగ్‌ అధికారులు పనుల గురించి వివరించారు. అనంతరం ఫీడర్‌ కెనాల్‌ పనులను సందర్శించారు. లైనింగ్‌, వాల్‌ కాంక్రీట్‌ పనులను పరిశీలించారు. వేగం పెంచాలని, రోజుకు 4మీటర్లు మేర కాంక్రీట్‌ పనులు చేయాలని ఆదేశించారు. ఆతర్వాత కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడారు. కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతానికి తాగు, సాగు నీటిని అందించే ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారన్నారు. సాంకేతికలోపాలు, కార్మికుల సమస్యను అధిగమించి వచ్చే జూన్‌ నాటికి పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్‌, అధికారులను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం డీజిల్‌ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీవో పి.ప్రభాకర్‌, ప్రాజెక్టు ఎస్‌ఈ అబూతాలిమ్‌, ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, కంభం ఎస్‌డీసీ శివరామిరెడ్డి, కెనాల్‌ నిర్మాణ సంస్థ ఎండీ శ్రీనివాసరావు, తహసీల్దారు అశోక్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 02:37 AM