Share News

సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:14 PM

సంపూర్ణ ఆరోగ్యానికి అనుదినం యోగాసాధన ఉత్తమ మార్గమని రాష్ట్ర సాంఘికసంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎ్‌సబీవీ స్వామి చెప్పారు.

సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే
ప్రకాశం జిల్లా పేరుతో యోగాంధ్ర సాధన

ఒంగోలులోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో కార్యక్రమం, పాల్గొన్న మంత్రి స్వామి

ఒంగోలు కలెక్టరేట్‌, జూన్‌21 (ఆంధ్రజ్యోతి) : సంపూర్ణ ఆరోగ్యానికి అనుదినం యోగాసాధన ఉత్తమ మార్గమని రాష్ట్ర సాంఘికసంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎ్‌సబీవీ స్వామి చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న కార్యక్రమానికి సమాంతరంగా ఉదయం ఆరుగంటల నుంచి 6.45 గంటల వరకు జరిగిన యోగా సాధన కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ హ్యాపీ, హెల్తీ సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా యో గాంధ్ర కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ యోగా సాధనను తమజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ యోగాసాధనపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 3.63 మందికిపైగా ప్రజలు అందుకోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ యోగాను జీవన విధానంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్‌ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన శైలికి యోగా సాధన ఎంతో ముఖ్యమన్నారు. కాగా గత రెండువారాలుగా యోగాసనాలలో శిక్షణ ఇచ్చిన గురువులను సత్కరించారు. ఈనెల 26వ తేదీన అంతర్జాతీయ డ్రగ్స్‌ వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని నషా ముక్త భారత్‌ ఇతి వృత్తంలో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. మాదకద్రవ్యాలను స్వీకరించబోమని ప్రజలతో ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, డీఆర్వో మాధురి, జిల్లా పర్యాటక అధికారి తేళ్ల రవికుమార్‌, యోగాంధ్ర నోడల్‌ అధికారి భీమనాధ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 11:14 PM