Share News

పునరావాస గ్రామాలకు పరిహారం చెల్లిస్తాం

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:00 AM

యర్రం చిన్నపొలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకం పునరావాస గ్రామాల వారికి వెంటనే పరిహారం చెల్లిస్తామని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విజయజ్యోతి తెలిపారు. బుధవారం కొరిశపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో పునరావాస గ్రామాలు అయిన కొరిశపాడు, ఆగ్రామశివారు తూర్పు గ్రామాల ప్రజలతో ఎస్‌డీ తో పాటు డిప్యూటీ తహసీల్దార్‌ మెహతాజ్‌లు సమావేశం అయ్యారు.

పునరావాస గ్రామాలకు పరిహారం చెల్లిస్తాం
పునరావాస గ్రామాల ప్రజలతో మాట్లాడుతున్న ఎస్‌డీసీ విజయజ్యోతి

మేదరమెట్ల, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): యర్రం చిన్నపొలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకం పునరావాస గ్రామాల వారికి వెంటనే పరిహారం చెల్లిస్తామని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విజయజ్యోతి తెలిపారు. బుధవారం కొరిశపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో పునరావాస గ్రామాలు అయిన కొరిశపాడు, ఆగ్రామశివారు తూర్పు గ్రామాల ప్రజలతో ఎస్‌డీసీతో పాటు డిప్యూటీ తహసీల్దార్‌ మెహతాజ్‌లు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విజయజ్యోతి మాట్లాడుతు కొరిశపాడు రిజర్వాయర్‌ నిర్మాణంతో గృహాలు కోల్పోతున్న రెండు గ్రామాల ప్రజలకు ఇళ్ల నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లిస్తామన్నారు. 2018లో పునరావాస గ్రామాలలోని గృహాలకు నష్ట పరిహారం మంజూరు అయిందని, అప్పట్లో వివిధ కారణాలతో నిధులు చెల్లించలేకపోయామన్నారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టు పనులకు సంబంధించి ఎటువంటి పురోగతి లేదన్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకుని కొరిశపాడు ఎత్తిపోతలకు సంబంధించి బడ్జెట్‌లో 30 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. రెండు గ్రామాల రైతులు గతంలో తయారు చేసిన జాబితాను పరిశీలించుకుని, ఖాతా నెంబర్లు ఇస్తే వెంటనే నగదు ఖాతాలల్లో జమ చేస్తామన్నారు. అందులో ఎవరైనా మరణించి ఉంటే వారి వారసులు అంగీకరించి ఒక ఖాతా నెంబరు ఇస్తే ఆ ఖాతాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. పునరావాసానికి అ వసరమైన 45 ఎ కరాల భూములలో ఇప్పటికే 25 ఎకరాలను గుర్తించామన్నారు. గతంలో ఆయకట్టు కింద పంట నష్టపోయిన రైతులకు కూడా పరిహారం చెల్లించడానికి కృషి చేస్తామన్నారు. బొల్లవరప్పాడు రిజర్వాయర్‌కు సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయి. వాటిని త్వరగా ముగించి పనులు ప్రారంభిస్తామన్నారు.

మంత్రి రవికుమార్‌కు

కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు

గత కొన్నేళ్లుగా నిర్వాసిత గ్రామాల సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొరిశపాడు ఎత్తిపోతలకు బడ్జెట్‌లో 30 కోట్లు కేటాయించడం పట్ల కొరిశపాడు, తూర్పుపాలెం గ్రామాల ప్రజలకు రవికుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా మంత్రి రవికుమార్‌ చొరవతోనే తమ భూములకు సంబంధించిన పరిహారాన్ని పొందామన్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నివాస గృహాలకు సంబంధించిన నష్ట పరిహారం రావడం, కొత్తగా ఇళ్లు నిర్మించుకోవడానికి భూ సేకరణ వైపు అడుగులు వేయడం అంతా రవికుమార్‌ చలవేనన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సింబోతు సత్యనారాయణ, ఏడెం భవాని ప్రసాద్‌ రెడ్డి, రెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:00 AM