పరిహారం.. చెలగాటం
ABN , Publish Date - Feb 18 , 2026 | 02:18 AM
పరిహారం విషయంలో బాధితులతో అధికారులు చెలగాటమాడుతున్నారు. పంగులూరు మండలం ముప్పవరం వద్ద హైవే నుంచి ప్రారంభమయ్యే బీకేవీ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు అద్దంకి మండలం బొమ్మ నంపాడు, జార్లపాలెం, ఉత్తర, దక్షిణ అద్దంకి, కొటికలపూడి, కుంకుపాడు, మోదేపల్లి నుంచి వెళ్తుంది. ఈక్రమంలో జరిగిన భూసేకరణలో చాలావరకు నష్ట పరిహారం చెల్లించారు.
గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భారీగా భూసేకరణ
చెల్లింపుల విషయంలో మీనమేషాలు
సాంకేతిక సమస్యలు, విలువల తేడాతో కొంతమందికి అందలేదు
పంటలకు చెల్లించని నష్టపరిహారం
వేగంగా జరుగుతున్న పనులు
బాధిత రైతులలో ఆందోళన
ఎన్నిసార్లు వెళ్లి కలిసినా పట్టించుకోని అధికారులు
పరిహారం విషయంలో బాధితులతో అధికారులు చెలగాటమాడుతున్నారు. పంగులూరు మండలం ముప్పవరం వద్ద హైవే నుంచి ప్రారంభమయ్యే బీకేవీ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు అద్దంకి మండలం బొమ్మ నంపాడు, జార్లపాలెం, ఉత్తర, దక్షిణ అద్దంకి, కొటికలపూడి, కుంకుపాడు, మోదేపల్లి నుంచి వెళ్తుంది. ఈక్రమంలో జరిగిన భూసేకరణలో చాలావరకు నష్ట పరిహారం చెల్లించారు. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు మాత్రం అందలేదు. అలాగే అద్దంకి పట్టణ పరిధిలో ఉన్న భూములకు తక్కువ ధర నిర్ణయం, ఇతరత్రా కారణాలతో పరిహారం పెండింగ్‌లో ఉండిపోయింది. ఆయా ప్రాంతాల్లో కూడా రోడ్డు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో బాధితులలో ఆందోళన నెలకొంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో పరిహారం పొందటం కష్టమేనన్న భావన వారిలో నెలకొంది.
అద్దంకి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): బెంగళూ రు-కడప-విజయవాడ(బీకేవీ) గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతుం డటంతో భూములు కోల్పోయి పరిహారం అందని రైతులలో ఆందోళన నెలకొంది. పరిహారం విషయాన్ని పలుమార్ల్లు అధికారులు, రోడ్డు నిర్మాణాన్ని పర్యవేక్షించే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన అంతంతమాత్రంగా ఉందని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా అద్దంకి పట్టణ సమీపం నుంచి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వెళ్తుండటం, నామ్ రోడ్డు క్రాస్ చేసే ప్రాంతంలో ఛేంజ్ ఓవర్ రింగ్ ఏర్పాటు చేస్తుండటంతో పెద్దమొత్తంలో భూసేకరణ జరిగింది. అది అత్యంత విలువైన ఇళ్ల స్థలాలుగా అమ్మకాలు జరిగే భూమి కాగా పరిహారం చెల్లింపులో మాత్రం పంట పొలాలుగా నమోదైంది. దీంతో పరిహారం అత్యల్పంగా ఉంది. కొటికలపూడి, తిమ్మారెడ్డిపాలెం వద్ద పంట పరిహారానికి సంబంధించి అవార్డు ప్రకటన కూడా జరిగింది. కొంతమంది రైతులకు పరిహారం చెల్లింపు మాత్రం జరగలేదు. అప్పట్లో సాగుచేసిన సుబాబుల్ తోటలకు పరిహారం అంచనా వేస్తూ అవార్డు ప్రకటన చేశారు. సాంకేతిక కారణాలతో చెల్లింపు ఆలస్యమైంది.
తక్కువ మంది కావడంతో..
పరిహారం అందకుండా మిగిలిపోయింది తక్కువ మంది కావటంతో విషయా న్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంకులు చెప్పవద్దని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిహారం చెల్లింపులు జరిగేలా చేస్తామని స్థానికంగా పర్యవేక్షణ చేసే అధికారులు చెప్పారు. దీంతో ఇప్పటివరకు రైతులు వేచిచూడటంతోపాటు, పలుమార్లు రోడ్డు నిర్మాణ పర్యవేక్షణ అధికారులను కూడా కలిశారు. అయినా స్పందన అంతంతమాత్రమే.
సెంటు రూ.10లక్షల వరకు..
అద్దంకి పట్టణంలో సెంటు భూమి ధర (నామ్ రోడ్డు క్రాస్ చేసే ప్రాంతం)లో సుమారు రూ.10లక్షల వరకు ఉండగా ప్రభుత్వ రిజిస్ర్టేషన్ విలువ తక్కువగా ఉండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అదేసమయంలో నామ్‌రోడ్డు క్రాస్ చేసే ప్రాంతంలో ఛేంజ్ ఓవర్ రింగ్‌రోడ్డులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పెద్దమొత్తంలో భూసేకరణ జరిగింది. దీంతో పలుసార్లు సమస్యను రైతులు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లగా అప్పట్లో బాపట్ల జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు. దీంతో తొలుత హడావుడి చేసిన రెవెన్యూ, రోడ్డు నిర్మాణ సంస్థ పర్యవేక్షణ అధికారులు అనంతరం పూర్తిగా పక్కనపెట్టినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లా పరిధిలోకి మారడంతో సమస్య అడుగున పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోతున్న వారికి వెంటనే పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.