Share News

అడవి జంతువుల దాడిలో పరిహారం పెంపు

ABN , Publish Date - Sep 06 , 2026 | 02:51 AM

నల్లమల అడవుల్లో సంచరించే అడవి జంతువుల దాడిలో మనుషులు, పశువులు మరణించినా, గాయపడినా ఇచ్చే నష్ట పరిహారం (ఎక్స్‌గ్రేషియా) మొత్తాలను ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ముక్కు ప్రసాద్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వన్య ప్రాణుల సంరక్షణ వాటి నివాస ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుండడంతో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోందన్నారు.

అడవి జంతువుల దాడిలో  పరిహారం పెంపు
పెద్దపులి దాడిలో మరణించిన గేదెను పరిశీలిస్తున్న ఫారెస్టు అధికారులు (ఫైల్‌)

డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ప్రసాద్‌రెడ్డి వెల్లడి

కంభం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : నల్లమల అడవుల్లో సంచరించే అడవి జంతువుల దాడిలో మనుషులు, పశువులు మరణించినా, గాయపడినా ఇచ్చే నష్ట పరిహారం (ఎక్స్‌గ్రేషియా) మొత్తాలను ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ముక్కు ప్రసాద్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వన్య ప్రాణుల సంరక్షణ వాటి నివాస ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుండడంతో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోందన్నారు. అదే సమయంలో అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో జనాభా, పశువులు పెరగడంతోపాటు తరచూ వచ్చే కరువుల కారణంగా అడవుల్లో నీరు, మేత, వనరులు తగ్గుతున్నాయన్నారు. దీంతో పులులు, ఇతర వన్యప్రాణులు గ్రామాలు, వ్యవసాయ పొలాలలోకి ప్రవేశించడం వలన మనుషులకు, పశువులకు ప్రాణహాని గానీ, గాయపడటం గానీ జరుగుతున్నదన్నారు. దీంతో గతంలో నిర్ణయించిన నష్టపరిహారాన్ని పెంచాలని రైతులు కోరడంతో వారి విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన పెంచిందని తెలిపారు. వన్యప్రాణుల దాడిలో మనిషి మరణిస్తే గతంలో రూ.5లక్షల పరిహారం ఉండగా ప్రస్తుతం రూ.10లక్షలు చేసిందన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి వైద్య ఖర్చుల కోసం గతంలో రూ.75వేలు ఉండగా ప్రస్తుతం రూ.2లక్షల వరకు పెంచిందన్నారు. స్వల్పంగా గాయపడిన వారికి రూ.20వేలు వైద్య ఖర్చులకు ఇస్తారని తెలిపారు. పెద్దపులి, ఇతర వన్యప్రాణుల దాడిలో పశువులు మరణిస్తే వాటి మార్కెట్‌ విలువ ఆధారంగా నష్టపరిహారం అందజేస్తారని తెలిపారు. అలాగే వరి పంటకు నష్టం వాటిల్లితే ఎకరాకు గతంలో రూ.6వేలు ఉండగా ఇప్పుడు రూ.10వేలు, చెరకు పంటకు ఎకరాకు గతంలో రూ.6వేలు ఉండగా ప్రస్తుతం రూ.12వేలు, మామిడి, కొబ్బరి చెట్లకు ఒక్కో చెట్టుకు రూ.2వేలు పరిహారంగా ఇస్తారని తెలిపారు. ఉద్యాన పంటలైన అరటి, సిట్రస్‌ తదితరాలకు నష్టాన్ని బట్టి రూ.12వేల నుంచి రూ.35వేల వరకు గరష్టంగా ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చాయని ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Sep 06 , 2026 | 02:51 AM