ధరలోటు భర్తీ ఆమోదయోగ్యం కాదు
ABN , Publish Date - Jul 30 , 2026 | 02:35 AM
తీవ్ర సంక్షోభంలో ఉన్న పొగాకు మార్కెట్‌తో భారీగా నష్టపో నున్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన లోగ్రేడ్ పొగాకుకు కిలోకు రూ.20 బోనస్ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పలువురు రైతు నాయ కులు తెలిపారు.
రోడ్డెక్కిన పొగాకు రైతులు
ఎస్‌కేఎం ఆధ్వర్యంలో త్రోవగుంట, టంగుటూరు వద్ద రాస్తారోకోలు
భారీగా నిలిచిన ట్రాఫిక్
పలువురు రైతు నాయకులు అరెస్టు, విడుదల
రూ.వెయ్యి కోట్లు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్
ఒంగోలు, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : తీవ్ర సంక్షోభంలో ఉన్న పొగాకు మార్కెట్‌తో భారీగా నష్టపో నున్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన లోగ్రేడ్ పొగాకుకు కిలోకు రూ.20 బోనస్ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పలువురు రైతు నాయ కులు తెలిపారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రూ.వెయ్యి కోట్లు నిధులు ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వేలం కేంద్రాల్లో నేరుగా పంట కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే మార్కెట్లో పోటీ ఏర్పడి ధరలు పెరిగి రైతులకు మేలు చేకూరుతుందన్నారు. అందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జిల్లాలో రెండు మాసాలకుపైగా వివిధ రూపాల్లో ఆందోళనలను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు సంఘాలు తాజాగా బుధవారం జాతీయరహదారి దిగ్బంధన కార్యక్రమం నిర్వహించాయి. ఒంగోలు నగరపరిఽధిలోని త్రోవగుంట వద్ద ముదిగొండ వాగు బ్రిడ్జిపైన, టంగుటూరు సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద వందలాది మంది పొగాకు రైతులతో రాస్తారోకో చేపట్టారు. త్రోవగుంట వద్ద ఎస్‌కేఎం జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య జిల్లాలోని రైతుసంఘాల ప్రతినిధులు వి.హనుమారెడ్డి, జె.జయంతిబాబు, లలితకుమారితోపాటు పలువురు పాల్గొన్నారు. టంగుటూరు వద్ద రైతు సంఘం జిల్లా నాయకులు పమిడి వెంకట్రావు, సిహెచ్.సాగర్, పరిటాల కోటేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు నేతలు మాట్లాడుతూ పొగాకును సగటు ధర కిలోకు రూ.200 తగ్గకుండా కొనాలని, నోబిడ్‌లు ఉండరాదని స్వయంగా సీఎం చెప్పినా వ్యాపారులలో మార్పు లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన లోగ్రేడ్ కిలోకు రూ.20 బోనస్‌తో సగటు ధర కిలో రూ.200 ఎలా వస్తుందని ప్రశ్నించారు. రైతులకు కిలో రూ.250 సటు ధర ఇస్తేనే ఈ ఏడాది పెట్టుబడులు అయినా వస్తాయన్నారు. అందుకోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రూ.వెయ్యి కోట్లు నిధులు ఇచ్చి నేరుగా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. పాలకులు వాస్తవాలను గుర్తించి ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కొంతసేపటి తర్వాత ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కాగా పొగాకు రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ముందస్తుగా కొందరు రైతుసంఘ నాయకులను అదుపులోకి తీసుకుని తాలూకా పోలీసుస్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
ఎస్‌బీఎస్‌లో 33.03శాతం నోబిడ్
దక్షిణాది పొగాకు మార్కెట్లో బుధవారం కూడా భారీగానే బేళ్లు నోబిడ్ అయ్యాయి. అవి ప్రత్యేకించి ఎస్‌బీఎస్ రీజియన్‌లో 33.03శాతం ఉన్నాయి. ఈ రీజియన్‌లోని ఐదు వేలం కేంద్రాలకు మొత్తం 3,575 బేళ్లను రైతులు అమ్మకానికి తీసుకురాగా 2,180 మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. గరిష్ఠ ధర కిలోకు రూ.250, కనిష్ఠ ధర రూ.160 లభించింది. సగటు ధర కిలో రూ.193.08 దక్కింది. మార్కెట్‌కు తెచ్చిన బేళ్లలో వివిధ కారణాలతో 1,395 తిరస్కరణకు గురవగా అందులో 1,181 (33.03శాతం) నోబిడ్ అయ్యాయి. అత్యధికంగా ఒంగోలు-2 కేంద్రంలో 38.41శాతం ఉన్నాయి. ఒంగోలు-1లో 38.41శాతం, కొండపిలో 32.44శాతం, టంగుటూరులో 29.36శాతం, వెల్లంపల్లిలో 29.33శాతం నోబిడ్ అయ్యాయి. ఎస్‌బీఎస్ రీజియన్‌తో పోల్చితే ఎస్‌ఎల్‌ఎస్ రీజియన్‌లో నోబిడ్‌ల సంఖ్య తక్కువగా ఉంది. ఈ రీజియన్‌లో ఆరు వేలం కేంద్రాలు ఉండగా బుధవారం మార్కెట్‌లో 20.99శాతం నోబిడ్ అయ్యాయి. మొత్తం 2,877 బేళ్లను రైతులు అమ్మకానికి తెచ్చారు. అందులో 2,126 కొనుగోలు జరగ్గా 751 వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. 604 నోబిడ్ అయ్యాయి. అత్యధికంగా కనిగిరిలో 50.06శాతం, పొదిలిలో 34.60శాతం నోబిడ్‌లు ఉన్నాయి. కాగా ఈ రీజియన్‌లో మంగళవారం సగటు ధర కిలో రూ.185.51 ఉండగా బుధవారం కిలోకు రూ.10 పెరిగి సగటున రూ.195.11 లభించింది.