నేర నియంత్రణకు నిబద్ధతతో పనిచేయాలి
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:10 AM
నేర నియంత్రణకు పోలీసు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు సూచించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
మార్కాపురంలో పోలీసు అధికారులతో నేర సమీక్ష
మార్కాపురం టౌన్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : నేర నియంత్రణకు పోలీసు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు సూచించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలను ఇంకా తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, మైనర్ డ్రైవింగ్‌లపై ప్రత్యేక దృష్టిసారించి కట్టడి చేయాలని ఆదేశించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత పెంచి చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయాలన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలని సూచించారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకుని రికవరీ శాతాన్ని పెంచాలన్నారు. దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు విజబుల్ పోలిసింగ్, నైట్ బీట్స్‌ను పెంచి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈతరాని పిల్లలు వాగుల్లోకి దిగకుండా వారి తల్లిదండ్రులు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబందిత శాఖలను సమన్వయం చేసుకోవాలన్నారు. మలుపులు, జంక్షన్‌లు, టీ జంక్షన్, వై జంక్షన్, యూటర్న్, విజబులిటీ తక్కువగా ప్రదేశాలను గుర్తించి అక్కడ అదనంగా హెచ్చరిక బోర్డులు, కుంభాకార దర్పణాలు, ప్రతిబింబించే స్ట్రిప్స్, వేగ పరిమితి సూచనలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్య ప్రాంతాల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబందనలపై ఇంకా విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో పేకాట, మట్కా, గంజాయి, కోడి పందేలు పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ సందర్శనలు చేసి ఎక్కడైనా గ్రామాల్లో గొడవలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, వైపాలెం, కంభం, గిద్దలూరు, అర్బన్, రూరల్, త్రిపురాంతకం సీఐలు కె.అజయ్‌కుమార్, మల్లికార్జునరావు, సురేష్, రామకోటయ్య, అస్సన్ పాల్గొన్నారు.