Share News

రారండోయ్‌.. వెలిగొండను చూద్దాం!

ABN , Publish Date - Sep 02 , 2026 | 02:50 AM

వెలిగొండ.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నోటా రెండు రోజులుగా వినిపిస్తున్న మాట. ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేసి కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు సోమవారం విడుదల చేశారు. ఇప్పుడు అందరూ వెలిగొండను చూసేందుకు ఉత్సాహపడుతున్నారు. మంగళవారం నుంచే ప్రాజెక్టు వద్దకు సందర్శకుల తాకిడి పెరిగింది.

రారండోయ్‌.. వెలిగొండను చూద్దాం!
వెలిగొండ ఫీడర్‌ కాలువలో పెరిగిన నీరు (ఇన్‌సెట్‌లో) ఫీడర్‌ కాలువ వద్ద సందర్శకులు

ఫీడర్‌ కాలువ వద్దకు వస్తున్న సందర్శకులు

జిల్లా ప్రజల కోసం ప్రత్యేక వాహనాల

ఏర్పాటు యోచనలో ప్రభుత్వం

కాలువలో పెరిగిన నీటి ప్రవాహం

తొలిరోజు 500 క్యూసెక్కులతో ప్రారంభం

రెండోరోజు 3,500 క్యూసెక్కులు విడుదల

నేడు 5వేలకు పెంచనున్న అధికారులు\

మార్కాపురం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నోటా రెండు రోజులుగా వినిపిస్తున్న మాట. ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేసి కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు సోమవారం విడుదల చేశారు. ఇప్పుడు అందరూ వెలిగొండను చూసేందుకు ఉత్సాహపడుతున్నారు. మంగళవారం నుంచే ప్రాజెక్టు వద్దకు సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రకాశం జిల్లా నుంచే కాకుండా కర్నూలు, శ్రీశైలం వైపు వెళ్లే వారంతా కుటుంబాలతో వచ్చి ఫీడర్‌ కాలువ వద్ద నీటి ప్రవాహాన్ని తిలకిస్తున్నారు. సీఎం ఆవిష్కరించిన శిలాఫలకం వద్ద ఫొటోలు దిగి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజైన సోమవారం 500 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన అధికారులు రెండో రోజు దానిని 3,500 క్యూసెక్కులకు పెంచారు. మూడోరోజు బుధవారం 5వేల క్యూసెక్కులతో కొనసాగించాలని భావిస్తున్నట్టు ప్రాజెక్టు ఈఈ కృష్ణారెడ్డి తెలిపారు.

కాలువపై పెట్రోలింగ్‌ ఏర్పాటు

నీటి ప్రవాహం క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో ఫీడర్‌ కాలువపై రెవెన్యూ, ఇరిగేషన్‌ సిబ్బంది పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. నిర్వాసిత గ్రామాల్లో ఎవరూ లేరని నిర్ధారించుకునేందుకు పరిశీలిస్తున్నారు. వంద శాతం కుటుంబాలు బయటకు వచ్చినప్పటికీ కొంతమంది వారి సామాన్లు కొన్ని ఉండిపోయాయని చెబుతున్నారు. వాటికోసం మళ్లీ ఎవరైనా గ్రామాల్లోకి వెళ్తారన్న ఉద్దేశంతో ముంపు గ్రామాలవైపు రాకపోకలను నిలిపివేసి బారికేడ్లు అడ్డుపెట్టి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సోమవారం రాత్రి ప్రవాహాన్ని చూసేందుకు పెద్దారవీడు మండలం కలనూతల వైపు వెళ్లిన ముగ్గురు యువకులు నీటిలో చిక్కుకుని రాత్రంతా ఇబ్బంది పడ్డారు. అతికష్టం మీద ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా అధికారుల పర్యవేక్షణలో వారిని బయటకు తెచ్చారు. ఈ ఘటన తరువాత అధికారులు అప్రమత్తమై ముంపు గ్రామాలవైపు ఎవరూ వెళ్లకుండా దారి మూసివేశారు. రోజుకు దాదాపు 6వేల క్యూసెక్కుల నీరు నల్లమల సాగర్‌కు తరలించగలిగితే అనుకున్న లక్ష్యం 10.7 టీఎంసీలు రావడానికి దాదాపు 20 రోజులు పట్టవచ్చని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

వెలిగొండను చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు

వెలిగొండ ద్వారా నీరు విడుదలైన తరువాత ప్రాజెక్టును చూసేందుకు స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తున్నారు. మరోవైపు మార్కాపురం జిల్లావాసులకు ప్రత్యేక వాహనాల ద్వారా ప్రాజెక్టు సందర్శనకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి మౌఖిక సమాచారం వచ్చినట్లు తెలిసింది. జిల్లాలోని 21 మండలాలకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రాజెక్టును చూపేందుకు సన్నాహాలు చేయాలని భావిస్తున్నారు. రోజుకొక మండలం చొప్పున 21 రోజులపాటు సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Updated Date - Sep 02 , 2026 | 02:50 AM