Share News

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

ABN , Publish Date - Mar 11 , 2026 | 02:56 AM

కీలక అంశాలపై సమీక్ష కోసం బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు రాష్ట్రప్రభుత్వం కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తోంది. అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయా రంగాలపై సమీక్షతోపాటు ప్రభుత్వ ఆలోచనలు, తదనుగుణంగా జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.

 నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

కీలక అంశాలపై నివేదికలతో వెళ్తున్న రాజాబాబు

రేపు శాంతిభద్రతలపై సమీక్షకు హాజరుకానున్న ఎస్పీ

ఒంగోలు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : కీలక అంశాలపై సమీక్ష కోసం బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు రాష్ట్రప్రభుత్వం కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తోంది. అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయా రంగాలపై సమీక్షతోపాటు ప్రభుత్వ ఆలోచనలు, తదనుగుణంగా జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం తరఫున మొత్తం మంత్రివర్గం, అన్నిశాఖల ముఖ్యకార్యదర్శులు, కమిషనర్లు వంటి ఉన్నతస్థాయి అధికారులు పాల్గొననున్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరవుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డాక ఈసారి జరగనున్నది ఆరో సదస్సు కాగా సగటున మూడు మాసాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. గత సమావేశం డిసెంబరు మూడో వారంలో నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సుకు సంబంధించి సమీక్షించే అంశాల అజెండాను నాలుగు రోజుల క్రితమే అన్ని జిల్లాలకు పంపించారు. అలాగే జిల్లాల నుంచి తాజా గణాంకాలను సేకరించారు. ప్రధానంగా రెండు రోజుల సదస్సులో తొలిరోజైన బుధవారం స్వర్ణాంధ్ర-2047 సాధన, అందుకు ప్రభుత్వం నిర్దేశించుకున్న పది సూత్రాలు, జిల్లాల వారీ స్థూల ఉత్పత్తి లక్ష్యాల సాధన, పీపీపీ ప్రాజెక్టుల పురోగతి, విభిన్న అంశాలపై వినూత్నంగా చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టుల విజయాలపై కొందరు కలెక్టర్లు అనుభవాలను వ్యక్తీకరించనున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందన, ఈ-ఆఫీసు అమలు, విభిన్న పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చ జరగనుంది.

Updated Date - Mar 11 , 2026 | 02:56 AM