Share News

ఢిల్లీ వెళ్లిన కలెక్టర్‌

ABN , Publish Date - Mar 24 , 2026 | 02:20 AM

కలెక్టర్‌ రాజాబాబు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మైనింగ్‌ మంత్రిత్వశాఖ డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) సమర్థవంతంగా వినియోగంపై సోమ, మంగళవారాల్లో జాతీయస్థాయి సమ్మిట్‌ను ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాల్లో మైనింగ్‌ అధికంగా ఉండే జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఇతర సంబంధిత శాఖ కీలక అధికారులను ఆహ్వానించింది.

ఢిల్లీ వెళ్లిన కలెక్టర్‌
ఢిల్లీలో సమావేశానికి హాజరైన కలెక్టర్‌ రాజాబాబు

డీఎంఎఫ్‌ వర్క్‌షాపునకు హాజరు

ఒంగోలు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : కలెక్టర్‌ రాజాబాబు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మైనింగ్‌ మంత్రిత్వశాఖ డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) సమర్థవంతంగా వినియోగంపై సోమ, మంగళవారాల్లో జాతీయస్థాయి సమ్మిట్‌ను ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాల్లో మైనింగ్‌ అధికంగా ఉండే జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఇతర సంబంధిత శాఖ కీలక అధికారులను ఆహ్వానించింది. ఆయా జిల్లాల్లో కొంత ఆదాయాన్ని డీఎంఎఫ్‌ పథకాలకు మళ్లించి మైనింగ్‌ ప్రాంతంలో మౌలిక రంగాల అభివృద్ధికి ప్రత్యేకించి తాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు వంటి సౌకర్యాల మెరుగునకు వినియోగిస్తున్న విషయం విదితమే. ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కల్యానిక్‌ యోజన (పీఎంకేకేకేవై) పేరుతో మైనింగ్‌ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక పథకం అమలులో ఉంది. దీని మార్గదర్శకాలకు అనుగుణంగా డీఎంఎఫ్‌ నిధులు వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో డీఎంఎఫ్‌ నిధుల వినియోగం, చేపడుతున్న కార్యక్రమాల ఫలితాలను విశ్లేషించి కేంద్ర పథకం పరిధిలోకి వాటిని అన్వయించి మరింత సమర్థవంతంగా అమలు చేసే లక్ష్యంతో ఈ సమ్మిట్‌ను కేంద్ర మైనింగ్‌ శాఖ నిర్వహిస్తోంది. కాగా రాష్ట్రంలోనే మైనింగ్‌లో అధికంగా జిల్లాలో ఆదాయం లభించడంతోపాటు డీఎంఎఫ్‌ ద్వారా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో సమ్మిట్‌కు కలెక్టర్‌ రాజాబాబు హాజరయ్యారు. సోమవారం పలు ఇతర జిల్లాల అధికారులతో కలిసి పాల్గొన్న కలెక్టర్‌ మంగళవారం కూడా సమ్మిట్‌కు హాజరై బుధవారం జిల్లాకు రానున్నారు. కలెక్టర్‌తోపాటు మైనింగ్‌ డీడీ రాజశేఖర్‌ కూడా ఈ సమ్మిట్‌కు వెళ్లారు.

Updated Date - Mar 24 , 2026 | 02:20 AM