గొనసపూడిలో కలెక్టర్ తనిఖీ
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:04 PM
చినగంజాం మండలంలోని గొనసపూడి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల స్థితిగతులను కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఇంటి జాగా లబ్ధిదారులతో మాటామంతీ
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకున్నారని ఆరా
కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్న వైనం
గొనసపూడి(చినగంజాం), ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి) : మండలంలోని గొనసపూడి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల స్థితిగతులను కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. మండల పరిధిలో ఇళ్ల స్థలాల కోసం 70 మంది దరఖాస్తు చేసుకోగా, గొనసపూడి గ్రామంలో 12 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. దరఖాస్తుదారులలో మెడబలిమి దానమ్మ ఉంటున్న ఇంటికి వెళ్లి వారి కుటుంబ స్థితిగతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు ఏవిధంగా చేసుకున్నారు, ఎవరికి చేసుకున్నారు, ఎక్కడ చేశారని ఆన్‌లైన్ దరఖాస్తు ఆఽధారంగా వారి వివరాలు అడిగారు. తనకు భర్త లేడని, ఉండటానికి నివాస గృహం లేదని, తన మామ ఇంటిలో తలదాచుకుంటున్నానని, ఎటువంటి ఆస్తిపాస్తులు లేవని అందుకోసం ఇంటి స్థలం కోసందరఖాస్తు చేసుకున్నానని దానమ్మ కలెక్టర్‌కు తెలిపారు. గ్రామంలో ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న 12 మందికి ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున ఎల్‌పీఎం సంఖ్య 1179లోని 36 సెంట్ల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆ స్థలం ఖాళీగా ఉండడానికి గల కారణాలను చీరాల ఆర్డీవో తూమాటి చంద్రశేఖర్‌నాయుడిని అడిగి తెలుసుకున్నారు. చీరాల డివిజన్‌లోని ఇళ్ల స్థలాల దరఖాస్తుల విషయమై ఆయన ఆర్డీవోని ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, హౌసింగ్ ఏఈ రాజశేఖర్, వీఆర్వో పి.నాగరాజు పాల్గొన్నారు.