Share News

డేగరమూడిలో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్‌

ABN , Publish Date - Jul 01 , 2026 | 11:16 PM

ఏమైనా సమస్యలు ఉన్నాయా, పింఛన్‌ను సొమ్మును ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, ప్రభుత్వం తరఫున ఏమైనా సాయం కావాలా అంటూ పింఛన్‌దారులను కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆప్యాయంగా మాట్లాడుతూ వారి జీవనపరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

డేగరమూడిలో  పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్‌
వృద్ధురాలికి పింఛన్‌ను అందజేస్తున్న కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌

మార్టూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : ఏమైనా సమస్యలు ఉన్నాయా, పింఛన్‌ను సొమ్మును ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, ప్రభుత్వం తరఫున ఏమైనా సాయం కావాలా అంటూ పింఛన్‌దారులను కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆప్యాయంగా మాట్లాడుతూ వారి జీవనపరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బుధవారం మండల పరిధిలో డేగరమూడి గ్రామంలో ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింఛన్‌దారుల ఇంటికి వెళ్లి, వారికి స్వయానా కలెక్టర్‌ పింఛన్‌ సొమ్మును అందజేశారు. అనంతరం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద ఏర్పాటు చేసిన కంపోస్టు పిట్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. ఎన్టీఆర్‌ పార్క్‌లో మొక్కలు నాటారు. పార్క్‌ చుట్టూ ప్రహరీ, వాకింగ్‌ ట్రాక్‌, వ్యాయామపరికరాలను ఏర్పాటు చేయాలని ఎంపీడీవోకు సూచించారు. గ్రామంలోని కొంతమంది లబ్ధిదారులు 1999లో తమకు ప్రభుత్వం ఇళ్లు కట్టించారని, ఇంతవరకు ఇళ్ల పట్టాలను ఇవ్వలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మరి కొంతమంది వారి పొలాలకు మ్యుటేషన్‌ చేయించాలని కోరారు.


ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ ప్రక్రియ వేగంగా చేపట్టాలి

రోజుకు 50 మందిని మ్యాపింగ్‌ చేయాలని, ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ ప్రక్రియను వేగంగా చేపట్టాలని, బీఎల్‌వోకి మరొక వ్యక్తిని సహాయకులుగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ మార్టూరు గ్రామ పంచాయతీ పరిధి నాగరాజుపల్లి రోడ్‌లో పర్యటించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాకు మ్యాపింగ్‌ చేస్తున్నామన్నారు. అదేవిధంగా 15వ బూత్‌కు సంబందించి, ఒక షాపు వద్ద జరుగుతున్న ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటి వరకు 97 మాత్రమే మ్యాపింగ్‌ చేసినట్లు బీఎల్‌వో కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి కలెక్టర్‌ లవన్న, ఆర్డీవో హరికుమార్‌, డీఆర్డీఏ పీడీ సింగయ్య, డ్వామా పీడీ విజయలక్ష్మి, తహసీల్దారు ప్రశాంతి, ఎంపీడీవో వై శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 11:16 PM