‘కోల్డ్’ కిటకిట
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:56 AM
శీతల గిడ్డంగులు తగినన్ని లేక కొండపి ప్రాంతంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఐదారేళ్లుగా పొగాకు రైతులు బేళ్లను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయడానికి అలవాటు పడ్డారు. ఈ కారణంగా ప్రస్తుతం కొండపి ప్రాంతంలో ఉన్న గిడ్డంగులు సరిపోవడం లేదు.
శనగ, కందులతో మరింత భారం
నాలుగు నెలలకు పొగాకు బేలుకు రూ.850
ఖాళీలు లేక సుదూర ప్రాంతాలకు వెళ్తున్న రైతులు
అక్కడ కూడా సిఫారసులు
శీతల గిడ్డంగులు తగినన్ని లేక కొండపి ప్రాంతంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఐదారేళ్లుగా పొగాకు రైతులు బేళ్లను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయడానికి అలవాటు పడ్డారు. ఈ కారణంగా ప్రస్తుతం కొండపి ప్రాంతంలో ఉన్న గిడ్డంగులు సరిపోవడం లేదు. దీంతో పొగాకు రైతులతోపాటు కంది, శనగ ఇతర పంటలు పండించే వారు నిల్వ చేసుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా పక్క జిల్లాలకు వెళ్లి తమ ఉత్పత్తులను వ్యయ ప్రయాసలకోర్చి నిల్వ చేసుకుంటున్నారు. అక్కడ కూడా తెలిసిన వారితో సిఫార్సు చేయించుకుంటేనే అవకాశం లభిస్తోంది. లేకుంటే సరుకు పెట్టుకోవడానికి స్థలం కష్టమవుతోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం స్పందించి కోల్డ్‌స్టోరేజీల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కొండపి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. స్థానికంగా తగినన్ని కోల్డ్‌స్టోరేజీలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. కొండపి, జరుగుమల్లి, టంగుటూరు, పొన్నలూరు, సింగరాయకొండ మండలాల్లో కోల్డ్ సోరేజీలు ప్రైవేటువి ఉన్నాయి. మర్రిపూడి మండలంలో ఒక్కటి కూడా లేదు. సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లో రెండేసి, కొండపి, జరుగుమల్లి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. టంగుటూరు- కొండపి- కామేపల్లి- వావిలేటిపాడు రింగ్ రోడ్డులో దాదాపు 50, వాటికి పరిసరాల్లో మరో 20 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో పొగాకు అధికంగా పండుతుంది. నాణ్యమైన పొగాకును రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకుంటున్నారు. మంచి ధర వచ్చినప్పుడు వేలం కేంద్రానికి తీసుకెళ్లి బేళ్లను అమ్ముకుంటున్నారు. మొత్తంగా నాలుగు నెలలపాటు శీతల గిడ్డంగుల్లో పొగాకు రైతులు నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది.
పక్క జిల్లాకు పరుగు
గడచిన ఏడాది శీతల గిడ్డంగుల యజమానులు క్వింటా పొగాకు బేలుకు నాలుగు నెలలకు రూ.500 వరకు బాడుగ తీసుకొన్నారు. ఈ ఏడాది ఒక బేలుకు రూ.850 వరకు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే పొగాకు నాలుగు కొట్లు రైతులు పూర్తి చేశారు. ప్రస్తుతం గిడ్డంగుల్లో ఖాళీ లేదని తెలిసి ఆందోళన చెందుతున్నారు. కోల్డ్‌స్టోరేజీలో పెడితే పొగాకు రంగు మారదు. అలాగే తూకం తగ్గదని సమాచారం. దీంతో రైతులంతా అక్కడ ఉంచేందుకే మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది నాణ్యమైన పొగాకు దిగుబడి వస్తుండటంతో ఇప్పటికే ఒక్కో రైతు 20 నుంచి 150 బేళ్ల వరకు గిడ్డంగులకు చేర్చారని అంటున్నారు. మర్రిపూడి మండలంలోని గ్రామాల రైతులు పొదిలి, కొనకనమిట్ల మండలాల్లోని గిడ్డంగులకు పొగాకు బేళ్లు తీసుకెళ్తుండగా, పొన్నలూరు మండలంలోని రైతులు ఓగూరు, సింగరాయకొండ, నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు పరిసరాల్లో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకుంటున్నారు. రైతులు వందల కిలోమీటర్లు ప్రయాసలు పడుతున్నారు.
ఇతర పంటలకు నిల్వ సౌకర్యం కరువు
శనగలు కూడా తప్పనిసరిగా శీతల గిడ్డం గుల్లో నిల్వ చేసుకోవాలి. లేదంటే పుచ్చి బుర్రల వుతాయని రైతులు వాపోతున్నారు. అదేవిధంగా కంది, ఇతర ఆహార ఉత్పత్తుల గింజలు కోల్డ్ స్టోరేజీల్లోనే నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పొగాకుతో గిడ్డంగులు నిండిపోయాయి. దీంతో ఇతర పంటలకు నిల్వ సౌకర్యం కరువవుతోంది.
కొండపి ఏఎంసీ పరిధిలో ఎక్కువగా అవసరం
కొండపి ఏఎంసీ పరిధిలోని కొండపి, జరుగుమల్లి, టంగుటూరు మండలాల్లో మరో మూడు, నాలుగు శీతల గిడ్డంగుల అవసరం ఉందని రైతులు అంటున్నారు. కొండపి నుంచి టంగుటూరు మధ్యన అనేక గ్రామాలు ఉన్నాయి. వెన్నూరులో కొండపి ఏఎంసీకి చెందిన దాదాపు 11 ఎకరాల స్థలం కూడా ఉంది. అదేవిధంగా టంగుటూరులో కొండపి ఏఎంసీకి 15 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ కొండపి ఏఎంసీ ఆధ్వర్యంలో శీతల గిడ్డుంగులు నిర్మిస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయమే కాకుండా రైతులకు సేవలు అందించిన వారవుతారని రైతులు అంటున్నారు. జరుగుమల్లి మండలంలో పశ్చిమ ప్రాంతంలో ప్రధాన గ్రామాల కూడలిలో ఒకటి, మర్రిపూడి మండలంలోని జువ్విగుంట కేంద్రంగా, కొండపి మండలంలోని పెట్లూరు కేంద్రంగా కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు అవసరమని రైతులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి శీతల గిడ్డంగులు నిర్మించి రైతులకు సేవలు అందించాలని రైతులు కోరుతున్నారు.