నెలాఖరులోపు సీఎం పర్యటన
ABN , Publish Date - Jun 13 , 2026 | 03:06 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెలాఖరులోపు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 20 నుంచి 27వ తేదీలోపు ఇటు ప్రకాశంలోనూ, అటు మార్కాపురం జిల్లాలోనూ ఆయన పర్యటనకు రానున్నారు.
కొండపి, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఉండే అవకాశం
ఒంగోలు, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెలాఖరులోపు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 20 నుంచి 27వ తేదీలోపు ఇటు ప్రకాశంలోనూ, అటు మార్కాపురం జిల్లాలోనూ ఆయన పర్యటనకు రానున్నారు. ఆమేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు సమాచారం కూడా ఇచ్చారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 20న ప్రకాశం, 27న మార్కాపురం జిల్లాలకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేస్తున్న సీఎం.. ప్రతి నియోజకవర్గాన్ని కనీసం ఒక్కసారైనా సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని ఎస్‌ఎన్‌పాడు, కందుకూరు, దర్శి నియోజకవర్గాలు.. మార్కాపురం జిల్లాలోని మార్కాపురం, వైపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తిచేశారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రధానమైన ప్రభుత్వ పథకం ప్రారంభోత్సవం లేదా కీలక అంశంపై ప్రజాచైతన్యం లక్ష్యంగా ఆయన పర్యటనలు సాగుతున్నాయి.
జలధార-జలహారతిపై అవగాహన
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార-జలహారతి కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కోసం నిర్వహించే కార్యక్రమాన్ని ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సీఎం ఇక జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, కొండపి నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. సెప్టెంబరులో ఒంగోలు మునిసిపాలిటీ 150 ఏళ్ల ఉత్సవాలకు వస్తారని సమాచారం. దీంతో అద్దంకి లేదా కొండపి సెగ్మెంట్లలో జలధార కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ రెండుచోట్ల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ స్వామి చర్చించుకొని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా కొండపివైపే వారు మొగ్గుచూపినట్లు సమాచారం. మంత్రి డాక్టర్ స్వామి, పార్టీ యువనేత దామచర్ల సత్య ఇద్దరూ సీఎం కార్యక్రమ నిర్వహణకు సానుకూలంగా ఉన్నారు. దీంతో ఆ నియోజకవర్గంలోనే పర్యటన ఉండే అవకాశం ఉంది.
గిద్దలూరులో ‘సంజీవని’..
హెల్త్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన సంజీవని కార్యక్రమాన్ని ఈనెల 27న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా కుప్పం నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలో ఈ పథకం అమలు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు 15లోపు మొత్తం పీహెచ్‌సీల పరిధిలో అమలు చేయాలని నిర్ణయించారు. అలా మూడో విడత సంజీవని కార్యక్రమాన్ని ఈనెల 27న గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబునాయుడు రానున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి అక్కడి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి కూడా సమాచారం ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది.