కొత్త జిల్లాలో సీఎం తొలి అడుగు
ABN , Publish Date - Feb 22 , 2026 | 10:53 PM
కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారి అడుగుపెట్టబోతున్నారు. కొన్ని రోజులుగా వెలిగొండ ప్రాజెక్ట్ సందర్శన కోసం సీఎం కార్యక్రమాన్ని రూపొందిస్తున్న సీఎంవో అధికారులు.. ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్న జిల్లా అధికారులకు ఆదివారం స్పష్టత ఇచ్చారు.
25న మార్కాపురంలో బాబు బహిరంగ సభ
వెలిగొండ ఫీడర్ కాలువ శంకుస్థాపన
బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
మార్కాపురం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారి అడుగుపెట్టబోతున్నారు. కొన్ని రోజులుగా వెలిగొండ ప్రాజెక్ట్ సందర్శన కోసం సీఎం కార్యక్రమాన్ని రూపొందిస్తున్న సీఎంవో అధికారులు.. ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్న జిల్లా అధికారులకు ఆదివారం స్పష్టత ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా రూ.456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేసిన తరువాత నేరుగా మార్కాపురం పట్టణంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొనేలా కార్యక్రమం రూపొందించారు. ఈ మేరకు అందిన సమాచారంతో ఇన్‌చార్జి కలెక్టర్ రాజాబాబు ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
తొలుత అనుకున్న విధంగా వెలిగొండ టన్నెళ్ల సందర్శన ఉంటుందని ఆదివారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ప్రాజెక్ట్ ఎస్‌ఈ అబుసలీం, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబులు టన్నెల్ లోపలకు దాదాపు 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పనులు పరిశీలించారు. అదే సమయంలో ఇన్‌చార్జి కలెక్టర్ రాజాబాబు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఫీడరు కాలువ పనులు పరిశీలిస్తుండగా సీఎంవో నుంచి సమాచారం అందింది. మార్కాపురంలో బహిరంగ సభ ఉంటుందన్న సమాచారంతో అధికారులతో సమీక్షించిన కలెక్టర్ పట్టణంలో బహిరంగ సభ కోసం స్థలం పరిశీలించారు. ఎమ్మెల్యే కందులతో కలిసి తర్లుపాడు రోడ్డులో బహిరంగ సభ స్థలం పరిశీలించి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీపంలోనే పట్టుపరిశ్రమ కార్యాలయం వద్ద హెలిప్యాడ్ నిర్మాణ పనులు కూడా త్వరితగతిన చేయాలని కలెక్టర్ చెప్పారు. బహిరంగ సభ వద్ద బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని డీపీవోను ఆదేశించారు. ప్రజలకు వసతుల కల్పనలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జేసీ శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు ఉన్నారు. జిల్లా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికేందుకు పట్టణంలో సభ దోహదపడుతుందనే ఆనందంలో ఉన్న పార్టీ శ్రేణులు, ప్రజలు సీఎం కార్యక్రమం విజయవంతం చేసి ఆయనకు కొత్త జిల్లా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.