నెలాఖరులో వెలిగొండకు సీఎం
ABN , Publish Date - Jan 22 , 2026 | 02:54 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెలాఖరులో వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. తొలుత ఈనెల 7న సీఎం వెలిగొండ సందర్శన కార్యక్రమం ఖరారు కాగా చివరి నిమిషంలో వాయిదా పడింది. సంక్రాంతి తర్వాత రావాల్సి ఉండగా దావోస్ పర్యటనతో మరికొంత జాప్యం జరిగింది.
ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు భూమిపూజ, ఇతర అంశాల పరిశీలన
ముందస్తు ఏర్పాట్ల కోసం రేపు రానున్న ఇరిగేషన్ మంత్రి నిమ్మల
ఒంగోలు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెలాఖరులో వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. తొలుత ఈనెల 7న సీఎం వెలిగొండ సందర్శన కార్యక్రమం ఖరారు కాగా చివరి నిమిషంలో వాయిదా పడింది. సంక్రాంతి తర్వాత రావాల్సి ఉండగా దావోస్ పర్యటనతో మరికొంత జాప్యం జరిగింది. ఈనెల 23 రాత్రికి సీఎం దావోస్ నుంచి రాష్ట్రానికి రానున్నారు. అనంతరం వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో నెలాఖరులో ఆయన వెలిగొండ సందర్శనకు వచ్చేలా షెడ్యూల్ ఖరారుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జలవనరులశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు సీఎం పర్యటన ఈనెల 27 నుంచి 30లోపు ఉండే అవకాశం ఉంది. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది. కాగా వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ఈ ఏడాది ఆగస్టుకు పూర్తి లక్ష్యంలో భాగంగా పలురకాల పనులు వేగంగా చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు పలు సమీక్షలలో వెలిగొండ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ తక్షణ చర్యలపై ఆదేశాలు ఇస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వీయ పర్యవేక్షణతో పనులను పర్యవేక్షిస్తూ వేగం పెంచారు.
లైనింగ్ పనులకు అంతా సిద్ధం
కీలకమైన వెలిగొండ ఫీడర్ కాలువ ఆధునికీకరణ పనులను రూ.476 కోట్లతో చేపడుతున్నారు. ఆ పనుల టెండర్‌ను పొందిన సంస్థ దాదాపు రెండు నెలలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి పనుల ప్రారంభానికి సిద్ధం చేసింది. ఇప్పటికే రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసి కాలువలో నిర్మించతలపెట్టిన కాంక్రీటు గోడల నిర్మాణాలను చేపట్టింది. ఇక ఆ పనులలో ప్రధానమైన మొత్తం 22కి.మీ ఫీడర్ కాలువ పొడవునా లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా నెలాఖరులో రానున్న సీఎం వాటికి భూమిపూజ చేయనున్నారు. అలాగే టన్నెల్ లోపల జరుగుతున్న లైనింగ్, ఇతర పనుల పరిశీలించడంతోపాటు అధికారులతో ప్రాజెక్టు నిర్మాణ పనులు, నిర్వాశితుల పునరావాస అంశాలపై సమీక్ష చేస్తారు. ఆ మేరకు సీఎంవో నుంచి స్పష్టత రావడంతో ముందస్తుగా ఏర్పాట్ల పరిశీలనకు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈనెల 23న వెలిగొండకు వస్తున్నారు. అందిన సమాచారం మేరకు ఆయన గురువారం రాత్రికి దోర్నాల చేరుకొని అక్కడ బస చేసి శుక్రవారం ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పనులను పరిశీలిస్తారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లపై వారికి దిశానిర్దేశం చేస్తారని సమాచారం.