గర్భకండ్రిక భూములకు పరిష్కారం చూపిన సీఎం
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:49 AM
భూములు ఉన్నా హక్కులు లేక.. రిజిస్ట్రేషన్లు జరగక, ప్రభుత్వ ప్రోత్సాహకాలేవీ అందక అవసరానికి అమ్ముకోవాలన్నా క్రయవిక్రయాలు జరగక ఆ భూమి ఉన్నా లేనట్లేనని కుమిలిపోతున్న రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పాట్‌లోనే ఊరట కల్పించారు.
జిల్లాలో 2,915 ఎకరాల భూమి ఉన్నట్లు అంచనా
1,310 మంది రైతులకు ప్రయోజనం
4 మండలాలు, 8 గ్రామాలలో సమస్య పరిష్కారం
దశాబ్ధాలుగా అపరిష్కారం
శాశ్వత పరిష్కారంపై రైతుల ఆనందపరవశం
నర్శింగోలులో కర్షకులతో సీఎం ముఖాముఖి
కందుకూరు, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): భూములు ఉన్నా హక్కులు లేక.. రిజిస్ట్రేషన్లు జరగక, ప్రభుత్వ ప్రోత్సాహకాలేవీ అందక అవసరానికి అమ్ముకోవాలన్నా క్రయవిక్రయాలు జరగక ఆ భూమి ఉన్నా లేనట్లేనని కుమిలిపోతున్న రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పాట్‌లోనే ఊరట కల్పించారు. గర్భకండ్రిక భూములకు రైత్వారీ పట్టాల జారీకి నిర్ణయం ప్రకటించటమే గాక కొందరు రైతులకు అక్కడికక్కడే రికార్డు పరిశీలించి తదనుగుణంగా రైత్వారీ పట్టాలు అందజేశారు. తాము బతికుండగా జరుగుతుందో లేదోనన్న ఆందోళనలో ఉన్న రైతులు చంద్రబాబు చేసిన పనితో ఆనందపరవశంలో తేలియాడారు.
జిల్లాలో 4 మండలాల పరిధిలో 8 గ్రామాలలో ఉన్న 1,301 మంది రైతులకు ఉన్న 2,915.10 ఎకరాలకు రైత్వారీ పట్టాల జారీకి ఆయన ఆదేశాలిచ్చేశారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో ఎక్కడైనా గర్భకండ్రిక భూముల సమస్యలు ఉన్నా వాటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూయిస్తూ సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీచేశారు.
కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలంలోని నర్శింగోలు గ్రామంలో గురువారం బహిరంగ సభ అనంతరం గర్భకండ్రిక భూముల సమస్య ఉన్న 8 గ్రామాలలో ఎంపికచేసిన రైతులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు కొన్ని దశాబ్ధాలుగా ఆ భూములు ఉన్నా హక్కులు లేక పడుతున్న వేదనను సీఎంకు వివరించారు. రమారమి 50 ఏళ్లుగా ఈ సమస్య ఉందని రైతులు సీఎంకు వివరించగా వారి మాటలను సావధానంగా విన్న సీఎం చంద్రబాబు సమస్యకు అక్కడిక క్కడే పరిష్కారం ప్రకటించారు. గర్భకండ్రిక, ఇనాం భూముల సమస్య పరిష్కారానికి చారిత్రక రెవెన్యూ రికార్డులను పరిశీలించాలని, రైతులు సమర్పించే పత్రాలను కూడా పరిశీలించి రైతులకు రైత్వారీ పట్టాలు జారీచేసి అన్ని హక్కులు కల్పించాలని నిర్థేశించారు. 1959 నాటి ఫారం 2 రికార్డుల ఆధారంగా భూముల వివరాలు, సాగుదారుల వివరాలను సీఎం స్వయంగా పరిశీలించి వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో భూమి స్వభావం, యాజమాన్య హక్కుదారులను మార్పుచేసేందుకు అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. అనంతరం అప్పటికప్పుడే రైత్వారీ పట్టాలు తయారు చేయించి నర్శింగోలు గ్రామానికి చెందిన 209 మంది రైతులకు 400.24 ఎకరాలకు రైత్వారీ పట్టాలు పంపిణీ కూడా చేశారు.
అదేవిధంగా కొండపి మండలంలో ఇలవర, వెన్నూరు గ్రామాలలో 281మంది రైతులకు 1003 ఎకరాలకు, జరుగుమల్లి మండలంలో పచ్చవ, వర్థినేనిపాలెం, నర్శింగోలు, కె. బిట్రగుంట గ్రామాల లో 569 మందికి 1260 ఎకరాలు, నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెంలో 430మంది రైతులకు 567 ఎకరాలకు , సింగరాయకొండ మండలం కలికివాయిలో 21మందికి 62 ఎకరాలకు రైత్వారీ పట్టాల జారీకి మార్గం సుగమం చేస్తూ ఆదేశాలు జారీచేశారు.