సీఎం చంద్రబాబు ఆదేశాలు బేఖాతరు
ABN , Publish Date - Jun 21 , 2026 | 11:15 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను బేఖాతరు చేసి నోబిడ్‌లు అధికంగా వేస్తున్న పొగాకు బోర్డు అధికారులు, వ్యాపారుల ధిక్కార ధోరణికి నిరసనగా ఈనెల 24నుంచి 27వ తేదీ వరకు కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపడుతున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు.
క్వింటా రూ.20వేలకు తక్కువ కొనుగోలు చేస్తే వేలాన్ని బహిష్కరించాలి
ఈనెల 24నుంచి కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను బేఖాతరు చేసి నోబిడ్‌లు అధికంగా వేస్తున్న పొగాకు బోర్డు అధికారులు, వ్యాపారుల ధిక్కార ధోరణికి నిరసనగా ఈనెల 24నుంచి 27వ తేదీ వరకు కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపడుతున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశానికి ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే జయంతిబాబు అధ్యక్షత వహించారు సమావేశంలో ఆయాసంఘాల నాయకులు రంగారావు, కే వీరారెడ్డి, లలితకుమారి, సీఎస్ సాగర్, వెంకట్రావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, ఎస్‌కే మాబు, కిలారి పెద్దాబ్బాయి, చెరుకూరి వాసు, తూబాటి శ్రీకాంత్, పరిటాల కోటేశ్వరరావు, గుళ్లాపల్లి వెంకట్రావులు మాట్లాడారు. సమన్వయ కమిటీల పేరుతో అనుకూలమైన వారితో సమావేశాలు నిర్వహించి రైతులకు ఏమి సందేశం పంపాలనుకుంటున్నారో బోర్డు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు చేపట్టిన ఆందోళనకు స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్వింటాకు రూ.20వేలు తగ్గకుండా కొనుగోలు చేస్తామని ఇచ్చిన ఆ హామీని అమలు చేయడంలో బోర్డు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఏ కేంద్రంలో ఆ ధరకు కొనుగోలు చేయకపోవడంతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొందన్నారు. నోబిడ్‌లలో ఎలాంటి మార్పు కూడా కనిపించడం లేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని వర్జీనియా పొగాకు కొనుగోళ్లకు వెయ్యి కోట్లు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించాలని డిమాండ్ చే శారు. అధిక ఉత్పత్తి, యూరోపియన్ దేశాల యుద్ధం పేరుతో రైతులను మోసం చేయాలని చూస్తే ఊరుకొని లేదని హెచ్చరించారు. క్వింటా రూ.20వేలకు తక్కువగా కొనుగోలు చేస్తే వేలాన్ని రైతులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈనెల 24నుంచి జరిగే దీక్షల్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.