9న సీఎం చంద్రబాబు రాక
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:25 PM
సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 9న జిల్లాకు రానున్నారు. కొండపి నియోజకవర్గంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఆమేరకు మంత్రి డాక్టర్ స్వామి, కలెక్టర్ రాజాబాబులకు ఆదివారం సాయంత్రం అధికారికంగా సమాచారం అందింది.
కొండపి నియోజక వర్గంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
పాలేరు రిజర్వాయర్, పైడిపాడు వద్ద బ్రిడ్జిలకూ శంకుస్థాపన చేసే అవకాశం
ఒంగోలు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 9న జిల్లాకు రానున్నారు. కొండపి నియోజకవర్గంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఆమేరకు మంత్రి డాక్టర్ స్వామి, కలెక్టర్ రాజాబాబులకు ఆదివారం సాయంత్రం అధికారికంగా సమాచారం అందింది. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో భూముల రీసర్వే నిర్వహించగా ఇంచుమించు అన్ని గ్రామాల్లోనూ తప్పులతడకగా సాగింది. కూటమి అధికారంలోకి వచ్చాక భూసమస్యలపై ఇటు అధికారులకు, అటు ప్రజాప్రతినిధులకు పెద్దఎత్తున వినతులు వస్తుండటంతో గతంలో రీసర్వే జరిగిన గ్రామాల్లో మళ్లీ సర్వే చేయించి ఆ తప్పులను సరిదిద్దే ప్రకియ్రను చేపట్టారు. అలా అన్ని జిల్లాల్లోనూ ఇప్పటికే చాలా గ్రామాల్లో సమస్యలను పరిష్కరించి రైతులకు కొత్త పాస్‌పుస్తకాలను అందజేస్తున్నారు. ప్రతి నెలా 9వ తేదీన రాష్ట్రంలోని ఒక జిల్లాలో ఈ కార్యక్రమానికి సీఎం హాజరవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 9న జిల్లాకు వస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉన్నతస్థాయిలో నిర్ణయించారు. ఆ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రస్తుతం సవరించిన పాస్‌పుస్తకాలు దాదాపు 8 వేలకుపైగా ఉన్నట్లు సమాచారం. జరుగుమల్లి మండలం నర్సింగోలు, బిట్రగుంట, టంగుటూరు మండలం కొణిజేడుల్లో ఒక్కో గ్రామంలో దాదాపు 800 నుంచి 1,000 పుస్తకాల వరకు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఏదో ఒక చోట సీఎం కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జరుగుమల్లి మండల సరిహద్దులోని పొన్నలూరు మండలం చెన్నిపాడు వద్ద పాలేరు నదిపై రిజర్వాయర్ నిర్మాణానికి ఆరు నెలల క్రితం రూ.166 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయగా ఆ పనులకు టెండర్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో కూడా పాలేరు రిజర్వాయర్ ఉంది. అదేమండలంలోని పైడిపాడు వద్ద పాలేరు నదిపై రూ.27 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. పాలేరు రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కావాలని గతంలోనే నిర్ణయించారు. ఈనేపథ్యంలో నర్సింగోలులో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి... పాలేరు రిజర్వాయర్, అలాగే పైడిపాడు బ్రిడ్జిల నిర్మాణాలకు కూడా శంకుస్థాపనలు చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలను పర్యవేక్షించే బృందం ఇక్కడకు వచ్చి ఆ ప్రాంతాలను పరిశీలించి అటు అధికారులు, ఇటు కొండపి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి డాక్టర్ స్వామి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్యతో చర్చించి సీఎం కార్యక్రమం ఎక్కడ అనేది నిర్ణయించనున్నారు. సోమ, మంగళవారాల్లో దీనిపై స్పష్టత రానుంది.