దర్శి, కనిగిరికి లైన్‌క్లియర్
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:08 AM
రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో దర్శి, కనిగిరి మున్సిపాలిటీల్లో అభ్యర్థుల తుదిజాబితా విడుదలకు అవకాశం లభించింది. దీంతో 25వ తేదీన ఇప్పుటికే ముగిసిన నామినేషన్ల ప్రక్రియకు అనుగుణంగా రెండు మున్సిపాలిటీల్లో వార్డుల సభ్యులకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు.
ఇద్దరు చైర్మన్లు ఏకగ్రీవమయ్యే అవకాశం
మిగతా చోట్ల యథావిధిగా ఎన్నికలు
మున్సిపల్ పోలింగ్ 1వ తేదీకి, లెక్కింపు 3వతేదీన
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో దర్శి, కనిగిరి మున్సిపాలిటీల్లో అభ్యర్థుల తుదిజాబితా విడుదలకు అవకాశం లభించింది. దీంతో 25వ తేదీన ఇప్పుటికే ముగిసిన నామినేషన్ల ప్రక్రియకు అనుగుణంగా రెండు మున్సిపాలిటీల్లో వార్డుల సభ్యులకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు దర్శిలో జనసేన, కనిగిరిలో టీడీపీ అభ్యర్థులు ఏక్రగీవంగా గెలిచే అవకాశం ఉంది. దర్శిలో మొత్తం 28 వార్డులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉండగా, కనిగిరిలో 32కుగాను 28వార్డులు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సుప్రీంకోర్టులో వైసీపీ వేసిన పిటిషన్‌లో దర్శిలో తిరిగి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలని కోరారు. కనిగిరిలో నామినేషన్ల ప్రక్రియ తిరిగి కొనసాగించాలని బీజేవైఎం నేతలు కోర్టును కోరారు. ఈ రెండు పిటిషన్లపై కోర్టు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ రెండుచోట్ల జరిగిన నామినేషన్ల ప్రక్రియ తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించారు. కనిగిరిలో ఒక వార్డులో మహిళ నామినేషన్ వేసేందుకు అడ్డుకున్నారని, కోర్టులో తెలపగా... కలెక్టర్ నిర్వహించిన విచారణలో సదరు మహిళ తనను ఎవరూ అడ్డుకోలేదని స్పష్టం చేసింది. ఇతర ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే దర్శిలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు కారణాలను, అప్పటి స్థితిగతులను పోలీసులపై వైసీపీ శ్రేణులు జరిపిన దాడులు తదితర అంశాలను ప్రత్యేకంగా పరిశీలించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు నామినేషన్ వేయడానికి వస్తే రక్షణగా ఉండి తమ వాహనంలోనే లోపలకు తీసుకెళ్తామని చెప్పడం, అలాగే వైసీపీ అభ్యర్థి తాను నామినేషన్ వేయబోనంటూ తన చేతిలోని నామినేషన్ పత్రాన్ని చించివేయడం వంటి విషయాలను విచారణ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ మేరకు అక్కడ కూడా ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగిందన్న అంచనాకు ఎన్నికల సంఘం వచ్చినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్ తాజా నిర్ణయం మేరకు ఉమ్మడి జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మిగిలిన మున్సిపాలిటీల్లో గతంలో ప్రకటించనట్లు ఈనెల 28న కాకుండా నవంబరు 1వతేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే ఓట్ల లెక్కింపు నవంబరు 3వతేదీన నిర్వహిస్తారు.