స్వచ్ఛరథాలు సిద్ధం
ABN , Publish Date - Jan 24 , 2026 | 02:31 AM
రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గృహాల్లో నిరుపయోగంగా ఉన్న పాత సామగ్రిని కొనుగోలు చేసి వారికి అవసరమైన వస్తువులను అందించనుంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు అవగాహన లేనికారణంగా పలురకాల వస్తువులు నిరుపయోగంగా ఉంటు న్నాయి.
నేడు ఆరు మండలాల్లో ప్రారంభం
మద్దిపాడులో పాల్గొననున్న కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే బీఎన్
గృహాల నుంచి పాత సామగ్రి సేకరణ
వాహనాల వద్ద ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు పలు రకాల వస్తువులు
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 23(ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గృహాల్లో నిరుపయోగంగా ఉన్న పాత సామగ్రిని కొనుగోలు చేసి వారికి అవసరమైన వస్తువులను అందించనుంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు అవగాహన లేనికారణంగా పలురకాల వస్తువులు నిరుపయోగంగా ఉంటు న్నాయి. తద్వారా కలిగే దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాటిని సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. అందుకోసం స్వచ్ఛరథాల పేరుతో వాహనాలు ఏర్పాటు చేస్తోంది. వాటి ద్వారా గృహాల్లో ఉండే పాత వస్తువులను కొనుగోలు చేయడంతోపాటు బదులుగా ప్రభుత్వం నిర్దేశించిన పలురకాల సరుకులను వినియోగదారులకు విక్రయించనున్నారు. తొలివిడతగా ఉమ్మడి జిల్లాలో మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు, కొత్తపట్నం, బల్లికురవ, పామూరు మండలాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్వచ్ఛరథాలను శనివారం ఆ ఆరు మండలాల్లో ప్రారంభించనున్నారు. మద్దిపాడులో జరిగే కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ పాల్గొంటున్నారు. ఈ వాహనాల ద్వారా ప్రజల నుంచి ఇనుము, పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్, గాజు బాటిళ్లు, స్టీల్, అల్యూమినియం వస్తువులను తీసుకుంటారు. అందుకు ప్రతిగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొబ్బరి నూనె బాటిళ్లు, సర్ఫ్ ప్యాకెట్లు, సబ్బులు, టీపొడి, కాఫీపొడి, కంఫర్ట్, లేస్ ప్యాకెట్లు, పేస్టు, ఉల్లిపాయలు, బ్రెష్‌లు, పెన్నులు, పెన్సిళ్లు, గోధుమపిండి, వేరుశనగ పప్పు, మినపపప్పు, కందిపప్పు వంటి వస్తువులను ఇస్తారు.