స్వచ్ఛ రథాలు వస్తున్నాయ్!
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:32 AM
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో భాగంగా రాష్ట్రప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకోసం స్వచ్ఛ రథం పేరుతో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని ఐదు మండలాల్లో ఈ రథాలను ఈనెల 17వ తేదీన ప్రారంభించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రజల నుంచి 27 రకాల వస్తువుల సేకరణ
అందుకు ప్రతిగా 12 రకాలు అందజేత
ఈనెల 17న ఐదు వాహనాలు ప్రారంభం
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో భాగంగా రాష్ట్రప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకోసం స్వచ్ఛ రథం పేరుతో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని ఐదు మండలాల్లో ఈ రథాలను ఈనెల 17వ తేదీన ప్రారంభించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేశారు. టంగుటూరు, కొత్తపట్నం, మద్దిపాడు, చీమకుర్తి, పామూరు మండలాల్లో ఈ వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా పాత ప్లాస్టిక్ డబ్బాలు, మిల్క్ ప్యాకెట్లు, పాలిథిన్ కవర్లు, ఐరన్, స్టీల్ వంటి 29రకాల వస్తువులను ప్రజల నుంచి సేకరిస్తారు. అందుకు ప్రతిగా కొబ్బరి నూనె, సర్ఫ్, నూనె, గోధుమపిండి, మినపపప్పు, కంఫర్టు వంటి 12 రకాల సరుకులను అందజేస్తారు.
వాహనాలకు టెండర్లు
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వినూత్న రీతిలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వచ్ఛరథాల కోసం ఇటీవల టెండర్లు పిలవగా ఐదింటికి రావడంతో వాటిని ఖరారు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం లో రైస్ పంపిణీకి వినియోగించిన వాహనాలను ప్రస్తుతం స్వచ్ఛరథం కోసం ఉపయోగించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన మార్పులతో ఆ వాహ నాలను సిద్ధం చేస్తున్నారు. స్వచ్ఛ రథాలను ఈనెల 17వతేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని డీపీవో ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే వాహనాలను కూడా సిద్ధం చేశామని ఆయన చెప్పారు.