పాత కక్షలతో ఇరువర్గాల ఘర్షణ
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:46 PM
పాతకక్షల నేపథ్యంలో పీసీపల్లి మండలం పెదయిర్లపాడు దళితకాలనీలో ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది.
పెదయిర్లపాడు ఎస్సీ కాలనీలో ఒక యువకుడు కత్తితో దాడి.. ఇద్దరికి గాయాలు
చికిత్స కోసం బైక్‌పై క్షతగాత్రులను వైద్యశాలకు తీసుకెళ్తుండగా వెంబండించి కారుతో ఢీ
పీసీపల్లి, జూలై 26(ఆంధ్రజ్యోతి) : పాతకక్షల నేపథ్యంలో పీసీపల్లి మండలం పెదయిర్లపాడు దళితకాలనీలో ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఇటీవల అన్నపురెడ్డిపల్లి కొత్తపల్లిలో ఎల్లమ్మ కొలుపులు జరిగాయి. ఆ కొలుపుల్లో కాలనీకి చెందిన కొందరు డప్పు వాయించేందుకు వెళ్లారు. నిర్వాహకులు ఇచ్చి న డబ్బులు పంచుకునేందుకు ఆదివారం ఉదయం సమావేశమయ్యారు. డబ్బుల విషయం మాట్లాడుకుంటున్న తరుణంలో గతంలో జరిగిన చర్చి స్థలం వివాద విషయంతోపాటు తన గురించే మాట్లాడుతున్నారని భావించిన సలోమాన్ వాళ్లని ప్రశ్నిస్తూ శ్యామ్, విలియం కేర్‌లతో ఘర్షణ పడ్డాడు. ఆవేశానికి లోనైన సలోమాన్ కత్తి తో వారిరువురిపై దాడిచేయడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. బంధువులు వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు పీసీపల్లికి బయలుదేరారు. ఈ క్రమంలోనే వెంగళాయపల్లి సమీపంలో మరో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ప్రశాంత్, అరిగెల శాంసన్‌లను.. కత్తితో దాడిచేసిన సలోమాన్ సోదరుడు అద్దంకి శ్యాంసన్ బైక్‌పై వెళ్తున్న వారిని కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. కారు ఢీకొనడంతో ఒకరి కా లు విరగ్గా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ వరుస ఘటనలతో పెదయిర్లపాడు, వెంగళాయపల్లి పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాయపడిన వారిని పీసీపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో కొందరిని కనిగిరి, మరికొందరిని కందుకూరు ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. పాతకక్షలే దాడులకు కారణమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సిఉంది.