Share News

చిలకలూరిపేట వద్ద చీమకుర్తి న్యాయవాది దారుణహత్య

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:19 AM

పల్నాడు జిల్లా చిలకలూరిపేట-కోటప్పకొండ మార్గంలో యడవల్లి గ్రామం సమీపంలో చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్‌ హరిప్రసాద్‌ (39) శుక్రవారం తెల్లవారుజామున దారుణహత్యకు గురయ్యారు.

చిలకలూరిపేట వద్ద చీమకుర్తి న్యాయవాది దారుణహత్య
మృతదేహంపై పడి ఉన్న స్కూటర్‌

చీమకుర్తి/చిలకలూరిపేట, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా చిలకలూరిపేట-కోటప్పకొండ మార్గంలో యడవల్లి గ్రామం సమీపంలో చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్‌ హరిప్రసాద్‌ (39) శుక్రవారం తెల్లవారుజామున దారుణహత్యకు గురయ్యారు. ప్రస్తుతం ఒంగోలులో నివాసముంటూ మార్కాపురం కోర్టులో కేసులు చూస్తుంటారు. న్యాయవాది మృతదేహం యడవల్లి వద్ద రోడ్డు పక్కన పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తొలుత రోడ్డుపక్కన ఆయన మృతదేహంపై స్కూటర్‌ పడి ఉండటంతో ఇది ప్రమాదమని భావించినప్పటికీ, ఘటనా స్థలంలో ఉన్న ఆనవాళ్లు, మృతదేహంపై ఉన్న గాయాలను పరిశీలించిన పోలీసులు దీనిని పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగా భావిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను బండరాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంగా చిత్రీకరించేందుకే మృతదేహంపై స్కూటర్‌ పడేశారని భావిస్తున్నారు. నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, చిలకలూరిపేట రూరల్‌ సీఐ సుబ్బనాయుడు, ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు ేసకరించారు. న్యాయవాది హత్యకు గల కారణాలపైన, నిందితుల ఆచూకీ కోసం పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తును ముమ్మరం చేశారు. వృత్తిరీత్యా ఆయనకు శత్రుత్వాలు, ఇతర వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. స్కూటర్‌పై న్యాయవాదితోపాటు మరొక వ్యక్తి కూడా ప్రయాణం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి శ్రీరామ తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్‌ సీఐ సుబ్బనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హరిప్రసాదు రెండేళ్ల క్రితం వరకు చీమకుర్తి పోలీసుస్టేషన్‌ ఎదుట కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకొని లా ప్రాక్టీస్‌ చేశారు. ఒంగోలు బార్‌ అసోసియేషన్‌లో సభ్యుడైన హరిప్రసాదు రెండేళ్ల నుంచి కుటుంబాన్ని ఒంగోలుకు మార్చి అక్కడ నుంచే ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అతని తండ్రి మృతి చెందటంతో కారుణ్య నియామకం కింద ఆయన తల్లి జిల్లాలోనే ఓ కోర్టులో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కాగా హరిప్రసాద్‌ హత్యకు గురయ్యారనే వార్త చీమకుర్తిలో చర్చనీయంశాంగా మారింది. ఆయన మృతదేహనికి శనివారం అంత్యక్రియలను చీమకుర్తిలో జరపటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:19 AM