చుక్కల్లో చికెన్, మటన్
ABN , Publish Date - Jan 17 , 2026 | 01:15 AM
పండుగ నేపథ్యంలో చికెన్, మటన్ ధరలు చుక్కలనంటాయి. కనుమ రోజైన శుక్రవారం ఒంగోలుతోపాటు జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాలు, ముఖ్యమైన గ్రామాల్లో చికెన్, మటన్ దుకాణాలు కిటకిటలాడాయి.
కిలో చికెన్ రూ.320 నుంచి రూ.350
మటన్ కిలో రూ.1,100 నుంచి 1,200
జిల్లావ్యాప్తంగా భారీగా అమ్మకాలు
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : పండుగ నేపథ్యంలో చికెన్, మటన్ ధరలు చుక్కలనంటాయి. కనుమ రోజైన శుక్రవారం ఒంగోలుతోపాటు జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాలు, ముఖ్యమైన గ్రామాల్లో చికెన్, మటన్ దుకాణాలు కిటకిటలాడాయి. ఒక్కరోజే సుమారు 35వేల కిలోలకుపైగా చికెన్, మరో 10వేల కిలోల మటన్ అమ్మకాలు జరిగి ఉంటాయని అంచనా. పండుగను ఆసరా చేసుకొని వ్యాపారులు ధరలు పెంచేశారు. నిన్న మొన్నటి వరకు బ్రాయిలర్ కోడి స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.300 నుంచి రూ.320 వరకు ఉండగా శుక్రవారం రూ.350 పలికింది. ఇక నాటుకోడి పండుగకు ముందు కిలో రూ.700 ఉండగా రూ.800కు విక్రయించారు. నిన్నమొన్నటి వరకు రూ.వెయ్యి ఉన్న మటన్‌ను రూ.1,100 నుంచి రూ.1,200కు అమ్మారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒంగోలు నగరంలో చికెన్‌ను రకరకాల ధరలతో విక్రయించారు.