Share News

మారనున్న చీమకుర్తి పట్టణ ముఖచిత్రం

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:13 PM

గెలాక్సీపురంగా పేరుగాంచిన చీమకుర్తి పట్టణ ముఖచిత్రం త్వరలోనే మారనుంది. గ్రానైట్‌ ధగధగలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినట్లే.. పట్టణం కూడా ధగధగలాడే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

మారనున్న చీమకుర్తి పట్టణ ముఖచిత్రం
చీమకుర్తి మధ్యగా వెళ్తున్న కర్నూలురోడ్‌ ఓవర్‌వ్యూ

సెంట్రల్‌ డివైడర్లు, లైటింగ్‌ సిస్టం ఏర్పాటు

రూ.13కోట్లతో అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం

చీమకుర్తి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి) : గెలాక్సీపురంగా పేరుగాంచిన చీమకుర్తి పట్టణ ముఖచిత్రం త్వరలోనే మారనుంది. గ్రానైట్‌ ధగధగలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినట్లే.. పట్టణం కూడా ధగధగలాడే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దాదాపు రూ.13కోట్ల నిధులతో హైబ్రిడ్‌ యాన్యూవటి మోడ్‌(హెచ్‌ఏఎం) పద్ధతిలో పట్టణాన్ని సుందరాంగంగా తీర్చిదిద్దేవిధంగా పనులు నిర్వహించటానికి మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. కుప్పం నుంచి సీఎం నారా చంద్రబాబునాయుడు వర్చువల్‌ విధానంలో పనుల ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. చీమకుర్తి మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్యెల్యే విజయ్‌కుమార్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొననున్నారు.

పనుల నిర్వహణ ఇలా...

రూ.పదికోట్ల నిధులను ఉపయోగించి పట్టణంలో శివారు కాలనీలతో పాటు సీసీ రోడ్లు లేని చోట సీసీరోడ్లు నిర్మించనున్నారు. మిగతా మూడు కోట్లను సెంట్రల్‌ డివైడర్లు, లైటింగ్‌ సిస్టం ఏర్పాటుకు కేటాయించనున్నారు. ఈ రూ.13కోట్ల నిధులలో నలభై శాతం ప్రభుత్వం భరిస్తుండగా, మిగతా అరవై శాతం కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ భరిస్తుంది.పట్టణ సుందరీకరణలో భాగంగా చీమకుర్తి తూర్పు బైపాస్‌ నుంచి పశ్చిమ బైపాస్‌ వరకూ పట్టణ నడిబొడ్డు నుంచి వెళ్తున్న కర్నూలు రోడ్డుపై సెంట్రల్‌ డివైడర్లు లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. పాత బస్టాండ్‌ సెంటర్‌కు అటూ ఇటూ రహదారి విస్తీర్ణం తక్కువగా ఉన్న నేపథ్యంలో రహదారి విస్తరణకు తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి వివాదాస్పదం కాకుండా ఒక నిర్ణయానికి వచ్చారు. నయాగర హోటల్‌ వద్ద నుంచి ఇసుక వాగు సెంటర్‌ వరకూ డివైడర్లు లేకుండా మిగతా పనులను నిర్వహిస్తారు. మిగిలిన రోడ్డు అంతా సెంట్రల్‌ డివైడర్లు, లైటింగ్‌ సిస్టంను పూర్తిస్థాయిలో నిర్వహిస్తారు. ఈ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కమిషనర్‌ రామకృష్ణయ్య తెలిపారు.

Updated Date - Sep 21 , 2026 | 11:13 PM