ఆర్‌ఎస్‌కేలతో అవినీతికి చెక్
ABN , Publish Date - Jul 23 , 2026 | 03:20 AM
రిజిస్ట్రేషన్ సేవలను సులభతరం చేసి, దళారీ వ్యవస్థను రూపుమాపి అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేటు-పబ్లిక్ భాగస్వామ్యంతో పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కేల)ను ఏర్పాటు చేస్తోంది.
రిజిస్ట్రేషన్ శాఖలో సరికొత్త వ్యవస్థ
పాస్‌పోర్టు కేంద్రాల మాదిరి సేవలు
త్వరలో ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు
తమ ఉపాధి పోతుందంటూ డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిలిచిపోయిన లావాదేవీలు
రిజిస్ట్రేషన్ సేవలను సులభతరం చేసి, దళారీ వ్యవస్థను రూపుమాపి అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేటు-పబ్లిక్ భాగస్వామ్యంతో పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కేల)ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించి గతనెలలో జీవో నెం.396 జారీ చేసింది. రాష్ట్రంలో మన్యం, పోలవరం మినహా మిగిలిన 26 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 26 రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని సేవలు ఆ సెంటర్లలోనే లభిస్తాయి. తద్వారా క్రయవిక్రయదారులు పారదర్శకంగా రిజిస్ర్టేషన్లు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఒంగోలు క్రైం, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలకమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాస్ పోర్టు సేవా కేంద్రాల తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు సంకల్పించింది. తద్వారా రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో అవినీతికి, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలని భావించింది. ఈ నేపథ్యంలో తాము ఉపాధి కోల్పోతామంటూ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు అన్ని ప్రాంతాలలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళనకు దిగారు. ఈనెల 20 నుంచి పెన్‌డౌన్ చేస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. జిల్లాలో రోజుకు సుమారు రూ.కోటిన్నరకుపైగా ఆదాయాన్ని రాష్ట్రప్రభుత్వం కోల్పోతోంది. రోజూ 350 నుంచి 400వరకు డాక్యు మెంట్లు రిజిస్ట్రేషన్ జరుగుతాయి. అయితే సోమవారం 15 డాక్యుమెంట్లు జరగగా, మంగళవారం ఆ సంఖ్య 10కి పడిపోయింది. మార్కాపురం జిల్లాలో ప్రతిరోజూ రిజిస్ర్ట్రేషన్‌ల ద్వారా రూ.కోటి వరకు ఆదాయం వస్తుంది. మూడు రోజులుగా రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడంతో దాదాపు రూ.3కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది.
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనితీరు
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలో పనిచేస్తాయి. ఆస్తుల క్రయవిక్రయాలు చేసేవారు ముందుగా స్లాట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంపు డ్యూటీ సేకరిస్తారు. అదేసమయంలో భూమి లేదా ఆస్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా సేవలు అందిస్తారు. డాక్యుమెంట్ తయారుతోపాటు అన్నివిధాలా సహకారం ఆర్‌ఎస్‌సీలలో అందుబాటులోకి తెస్తారు.
అధికారాలన్నీ సబ్- రిజిస్ర్టార్‌లకే ఉంటాయి
చట్టపరమైన, నిర్ణయాత్మకమైన అధికారాలు అన్నీ సబ్‌రిజిస్ర్టార్లకు ఉంటాయి. బయోమెట్రిక్ పరిశీలన, డిజిటల్ సంతకాలు, క్రయవిక్రయదారుల గుర్తింపు ధ్రువీకరించే అధికారం కూడా సబ్ రిజిస్ర్తార్లదే. ఆస్తి మార్పిడి చేయడాన్ని ఆమోదించి దస్తావేజుల పంపిణీ చేసే పూర్తి అధికారం వారికే ఉంటుంది.
ప్రజలకు కలిగే ప్రయోజనం
క్రయవిక్రయదారులు ఎక్కడ నుంచి అయినా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువ సమయం వేచి ఉండకుండా స్లాట్ టైంలోనే సేవా కేంద్రాల వద్దకు వెళ్లి వెంటనే పనులు ముగించుకోవచ్చు. ప్రక్రియ అంతా ఆన్‌లైన్, డిజిటల్ కావడంతో పారదర్శకత పెరుగుతుంది.
డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన
రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాటు నుంచి డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ ఉంది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుతో తమ జీవనోపాధిపోతుందని వారు ఆందోళనకు దిగారు. ప్రైవేటు వ్యక్తులకు ప్రజల డేటా వెళ్లే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. తద్వార ఆస్తులకు భద్రత కరువయ్యే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తమ కుటుంబాలు వీధిన పడతాయని వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెన్‌డౌన్ చేపట్టి నిరసనకు దిగిన వారు సోమవారం సబ్-రిజిస్ర్టార్లకు వినతిపత్రాలు ఇచ్చారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలను సమర్పించారు.