అక్రమాలకు చెక్
ABN , Publish Date - Mar 03 , 2026 | 02:47 AM
ఉపాధిలో మస్టర్ అక్రమాలు ఇక కుదరవు. పనులకు రాని వారికి హాజరు వేసే సిబ్బంది అవినీతికి చెక్ పడినట్లే. ఉపాధి హామీ పథకం అమలులో చట్ట సవరణతోపాటు పలు మార్పులు, చేర్పులు చేపట్టిన కేంద్రప్రభుత్వం.. బోగస్ మస్టర్ల నిరోధం లక్ష్యంగా ఈ తాజా విధానాన్ని తీసుకొచ్చింది.
‘ఉపాధి’ లో బోగస్ మస్టర్ కుదరదిక..
కూలీలకు ముఖ హాజరు... అమలులోకి నూతన విధానం
ఇటీవలే జాబ్‌కార్డులకు ఆధార్ అనుసంధానం, ఆపై ఈకేవైసీ
గత మస్టర్ల నమోదు విధానంలో భారీగా అక్రమాలు
ఉద్యోగుల తరహాలో ఉపాధి హామీ పథకం కూలీలకు కూడా ముఖహాజరు విధానం అమలులోకి వచ్చింది. పనులకు కూలీలు వచ్చినప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ లేదా పని చేయించే మేట్ (మేస్త్రీ) వద్ద ఉన్న ఫోన్‌లో వారి కళ్లు (ఐరిష్) ఫొటో తీసి హాజరువేయాలి. ఇప్పటికే జాబ్‌కార్డులు ఉన్న కూలీలకు ఆధార్ నెంబరు అనుసంధానంతోపాటు ఈకేవైసీ కూడా చేసి ఉన్నారు. దీంతో పనికి వచ్చిన వారి ఐరిష్ ఫోన్‌లో చూపగానే వారికి ఆటోమేటిక్‌గా హాజరు పడుతుంది. పనులకు రాని వారికి బోగస్ మస్టర్లు వేసి పాల్పడే అవినీతికి చెక్ పడనుంది.
ఒంగోలు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : ఉపాధిలో మస్టర్ అక్రమాలు ఇక కుదరవు. పనులకు రాని వారికి హాజరు వేసే సిబ్బంది అవినీతికి చెక్ పడినట్లే. ఉపాధి హామీ పథకం అమలులో చట్ట సవరణతోపాటు పలు మార్పులు, చేర్పులు చేపట్టిన కేంద్రప్రభుత్వం.. బోగస్ మస్టర్ల నిరోధం లక్ష్యంగా ఈ తాజా విధానాన్ని తీసుకొచ్చింది. సోమవారం నుంచి అది అమలులోకి వచ్చింది. పథకం అమలు ప్రారంభమయ్యాక చాలా సంవత్సరాలు పనికి వచ్చిన కూలీల హాజరును ఆ గ్రామంలోని ఫీల్డ్ అసిస్టెంట్ లేదా అక్కడి మేట్ (మేస్త్రీ) కాగితాలపై నమోదు చేసేవారు. ఆ విధానంలో భారీగా అక్రమాలు జరిగేవి. పనులకు రాని వారికి సైతం తమకు ఇష్టమైతే ఉపాధి క్షేత్రస్థాయి సిబ్బంది హాజరు వేసేవారు. అవేకాక అసలు పనికిరాని కొన్ని పేర్లకు లేదా తమ కుటుంబ సభ్యుల పేర్లతో మస్టర్లు వేసుకొని ఆ నగదు స్వాహా చేసేవారు. చాలాచోట్ల గ్రామ స్థాయిలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ స్థానిక నేతలు కూడా వాటాలు తీసుకునేవారు. వాటిని అరికట్టడానికి కొన్ని ప్రత్యేకమైన మార్పులు, విధానాలు తెచ్చినా అవి ఏమాత్రం అవకతకవకలను అడ్డుకోలేకపోయాయి. ఉపాధి సిబ్బంది ఏదో ఒక రూపేణా అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు.
లక్ష జాబ్‌కార్డులకు ఈకేవైసీ పెండింగ్
ఉమ్మడి జిల్లాలో మొత్తం 6.29 లక్షల మంది కూలీలకు జాబ్‌కార్డులు ఉండగా వారిలో 5.28 లక్షల మందికి ఈకేవైసీ పూర్తయింది. ఇంకా సుమారు లక్షమందికిపైగా ఈకేవీసీ చేయాల్సి ఉండగా వారిలో అత్యధికులు వివిధ వ్యవసాయ, ఇతర పనుల కోసం తాత్కాలికంగా వలస వెళ్లి ఉన్నట్లు డ్వామా సిబ్బంది గుర్తించారు. అలాంటి వారు తిరిగి తమ ప్రాంతానికి చేరుకొని పనులకు వచ్చే సమయంలో ఈకేవైసీ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద తాజాగా తెచ్చిన విధానంతో బోగస్ మస్టర్లకు చెక్‌పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.