‘తారు’మారు!
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:28 AM
ఆమెరికా, ఇరాన్ యుద్ధంతో తారు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కాంట్రాక్టర్‌లకు తారు అందుబాటులో ఉండటం లేదు. దీన్ని ఆసరా చేసుకుని జాతీయ రహదారి మీదుగా రవాణా అయ్యే తారు ట్యాంకర్ల డ్రైవర్లు అక్రమార్కులతో లాలూచీ పడి దొంగతనంగా తారు విక్రయిస్తున్నారు.
హైవే కేంద్రంగా అక్రమ వ్యాపారం
కాంట్రాక్టర్‌లతో ట్యాంకర్ల డ్రైవర్లు లాలూచీ
మేదరమెట్ల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆమెరికా, ఇరాన్ యుద్ధంతో తారు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కాంట్రాక్టర్‌లకు తారు అందుబాటులో ఉండటం లేదు. దీన్ని ఆసరా చేసుకుని జాతీయ రహదారి మీదుగా రవాణా అయ్యే తారు ట్యాంకర్ల డ్రైవర్లు అక్రమార్కులతో లాలూచీ పడి దొంగతనంగా తారు విక్రయిస్తున్నారు. గతంలో ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు కిరోసిన్ సరఫరా చేసేది. డీలర్లు దాన్ని దారి మళ్లించి లారీలకు అమ్ముకునేవారు. డీజిల్‌కు, కిరోసిన్‌కు లీటర్‌కు పది రూపాయలు తేడా ఉండడంతో కొంతమంది లారీ ఓనర్లు, డ్రైవర్లు కిరోసిన్ పోయించుకునేవారు. ప్రభుత్వం రేషన్ కిరోసిన్‌ను నిలిపివేశాక బ్లూ కిరోసిన్ పేరుతో కొన్నాళ్లు వ్యాపారం నడిచింది. అడపాదడపా లారీ డ్రైవర్లు తమ ట్యాంకర్ల నుంచి తక్కువ ధరకు డిజిల్‌ను విక్రయించేవారు. ఆ డీజిల్‌ను కొంతమంది అక్రమ వ్యాపారులు లారీలకు పోస్తూ లాభాలు ఆర్జించేవారు. ఇటువంటి వ్యాపారాలు 2015కు ముందు నడిచేవి. ఈమధ్య కాలంలో ల్యూబ్రికెంట్ ఆయిల్ రవాణా చేసే లారీల నుంచి డ్రైవర్లను ప్రలోభపెట్టి ఆయిల్‌ను దొంగిలించి నిల్వచేస్తు న్నారు. ఇటువంటి వ్యాపారాలు హైవేలో కావలి నుంచి చిలకలూరిపేట వరకు, మేదరమెట్ల నుంచి పిడుగురాళ్ల వరకు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో తారు కొరత రావడంతో లారీ డ్రైవర్లు అక్రమ వ్యాపారులకు తారును విక్రయించడం ఎక్కువైంది. స్థానిక పోలీసులు, విజిలెన్స్ అధికారులకు నెలవారీ ముడుపులు ముట్టచెప్పడంతోనే అక్రమ వ్యాపారానికి అడ్టూ అదుపులేకుండా పోయింది. తమిళనాడులోని వివిధ ఆయిల్ కంపెనీల నుంచి రవాణా అయ్యే తారును విక్రయిస్తున్నారు. మేదరమెట్ల బైపాస్‌కు పడమర వైపున చాటుగా ఉన్న ప్రాంతంలో శనివారం రెండు తారు ట్యాంకర్ల నుంచి 20 పీపాల తారును పట్టి నిల్వ ఉంచారు. దీనిపై పోలీసులు, విజిలెన్స్ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైవేలో దొంగ వ్యాపారాల పట్ల పోలీసులు కఠినంగా వ్యహరించాలని స్థానికులు కోరుతున్నారు.